తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనవరిలో త్రివిధ దళాల ఉమ్మడి సారథి నియామకం - జనవరిలో త్రివిధ దళాల ఉమ్మడి సారథి నియామకం

త్రివిధ దళాల ఉమ్మడి సారథి నియామకం వచ్చే జనవరిలో ఉంటుందని వెల్లడించింది కేంద్రం. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ నేతృత్వంలోని కమిటీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలిపింది. ప్రధానమంత్రి, రక్షణ మంత్రికి.. సింగిల్​ పాయింట్​ మిలటరీ సలహాదారుగా వ్యవహరించనున్నారు సీడీఎస్​. ఈ అత్యున్నత పదవి రేసులో సైన్యాధిపతి​ జనరల్​ బిపిన్​ రావత్​ ముందంజలో ఉన్నారు.

త్రివిధ దళాల ఉమ్మడి సారథి

By

Published : Nov 20, 2019, 6:24 PM IST

దేశ భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా త్రివిధ దళాలకు ఉమ్మడి సారథ్యం వహించే 'చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​' (సీడీఎస్​) నియామకంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. వచ్చే ఏడాది జనవరిలో నియామకం చేపట్టనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ పూర్తి చేసినట్లు తెలిపాయి.

ప్రధానమంత్రి, రక్షణ మంత్రికి..​ సింగిల్​ పాయింట్​ మిలటరీ సలహాదారుగా వ్యవహరించనున్నారు సీడీఎస్​.

ఆగస్టు 15న ప్రకటన..

త్రివిధ దళాలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సమర్థమైన నాయకత్వం కోసం చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

3 వారాల్లో తుది కార్యాచరణ..

మోదీ ప్రకటన చేసిన కొద్ది రోజులకే జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్​ నేతృత్వంలో సీడీఎస్​ అమలు కమిటీని నియమించింది కేంద్రం. సీడీఎస్​ విధులు, బాధ్యతలను ఈ కమిటీ ఖరారు చేయనుంది. మూడు వారాల్లో డోభాల్​ కమిటీ తుది కార్యచరణతో వస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ముందంజలో రావత్​...

అత్యున్నత స్థాయి పదవికి ఇప్పటికే సైన్యం, నావికాదళం, వాయుసేన వారి వారి సీనియర్​ కమాండోల పేర్లు సిఫార్సు​ చేశాయి. ఈ జాబితాలో సైన్యాధిపతి​ జనరల్​ బిపిన్​ రావత్​ ముందంజలో ఉన్నారు. కానీ.. ఈఏడాది డిసెంబర్​ 31న పదవీ విరమణ చేయనున్నారు రావత్​. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఆ లోపే రావత్​ పేరును సీడీఎస్​గా ప్రకటించే అవకాశం ఉంది.

సీడీఎస్​లోకి ఐడీఎస్​..

ప్రస్తుతం త్రివిధ దళాలు.. ఇంటిగ్రేటెడ్​ డిఫెన్స్​ స్టాఫ్​ (ఐడీఎస్​) సమన్వయంతో పనిచేస్తున్నాయి. అయితే.. సీడీఎస్​ నియామకం పూర్తయిన తర్వాత ఐడీఎస్​ అందులో మిళితం కానుంది.

19 ఏళ్లుగా...

త్రివిధ దళాల ఉమ్మడి సారథిపై 1999 కార్గిల్​ యుద్ధం తర్వాత రక్షణ శాఖకు ఉన్నత స్థాయి కమిటీ నివేదించింది. మూడు దళాల మధ్య అంతరం తొలగించేందుకు ఒకే అధిపతి అవసరమని తెలిపింది. జాతీయ భద్రత విషయంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన మంత్రుల బృందమూ ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావించింది.

త్రివిధ దళాలకు ఉమ్మడి శాశ్వత ఛైర్మన్​ ఉండాల్సిన అవసరం ఉందని నరేశ్​ చంద్ర టాస్క్​ ఫోర్స్​ 2012లో సూచించింది. ఇందులో సైన్యం, నావికా దళం, వైమానిక దళ అధిపతుల్లో సీనియర్​ వ్యక్తిని ఛైర్మన్​గా నియమించాలని సిఫార్సు చేసింది.

ఇదీ చూడండి: 'ఉగ్రవాద పోరులో ద్వంద్వ విధానాలకు తావుండరాదు'

ABOUT THE AUTHOR

...view details