తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా అంతానికి భారతావని సిద్ధం- నేటి నుంచే టీకాలు

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారతావని సిద్ధమైంది. ఏడాది కాలానికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి అంతమే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉదయం 10:30 గంటలకు ఈ బృహత్తర కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశాయి. తొలి రోజు 3006 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయనున్నారు.

India all set for world's largest vaccination drive
కరోనా అంతానికి భారతావని సిద్దం- నేటి నుంచే టీకాలు

By

Published : Jan 16, 2021, 5:49 AM IST

Updated : Jan 16, 2021, 6:26 AM IST

కరోనా అంతానికి భారతావని సిద్దం- నేటి నుంచే టీకాలు

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి దేశం సిద్ధమైంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పలువురు టీకా లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల6 కేంద్రాలలో సుమారు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు శనివారం టీకాలు వేయనున్నారు. ప్రతి కేంద్రంలోనూ.. సుమారు వందమంది లబ్ధిదారులకు టీకాలు వేయనున్నారు. అవసరమైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరవేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన ఆన్‌లైన్ డిజిటల్ ఫ్లాట్‌ఫాం కొ-విన్ యాప్‌ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాల నివృత్తికి 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1075ను ఏర్పాటు చేశారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్... కరోనా అంతానికి ఇదే ఆరంభమన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటికీ నిర్లక్ష్యంగా ఉండరాదన్న హర్షవర్ధన్.. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేశారు.

దిల్లీలో తొలి టీకా ఎవరికంటే..

దిల్లీలో సీఎం కేజ్రీవాల్ సమక్షంలో ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో ఓ డాక్టర్, నర్స్, పారిశుద్ధ్య కార్మికుడికి తొలుత టీకాలు వేయనున్నారు. రాజస్థాన్‌లో జైపుర్ సవాయ్ మాన్‌ సింగ్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుధిర్ భండారీ తొలి వ్యాక్సిన్ అందుకోనుండగా, మధ్యప్రదేశ్‌లో ఓ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు, అటెండర్‌లకు తొలి టీకా వేయనున్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్‌, గాంధీనగర్‌లలోని............ ప్రభుత్వ మెడికల్ సూపరిటెండెంట్లకు తొలుత టీకాలు వేయనున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి లోక్‌సభ ఎంపీ మహేశ్ శర్మ టీకాను తొలుత అందుకోనున్న పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా నిలిచారు.

దశలవారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగనుండగా మొదటి విడతలో కోటి మంది ఆరోగ్యరంగ కార్యకర్తలకు, 2కోట్ల మంది కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకాలు వేయాలని కేంద్రం సంకల్పించింది. 50 ఏళ్లు పైబడినవారికి, యాభై ఏళ్లు లోపు ఉండి దీర్ఘకాలికసమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి తర్వాతి దశలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్య రంగ కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు వేసే టీకాల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.

ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- 19న మరోసారి భేటీ!

Last Updated : Jan 16, 2021, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details