తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మహమ్మారి గుట్టు తేల్చాల్సిందే' - కోవిడ్ -19 మూలం గురించి విచారణ

కొవిడ్​-19 పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తు చేపట్టాలని 62 దేశాల కూటమి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సులో చేసిన ప్రతిపాదనకు భారత్​ మద్దతు తెలిపింది. చైనాను దృష్టిలో ఉంచుకొని దీన్ని సిద్ధం చేస్తున్నా.. ఆ దేశం పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అంశంపై అమెరికా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు.

INDIA ABOUT CORONA VIRUS PANDEMIC
కరోనా గుట్టు తేల్చాల్సిందే

By

Published : May 18, 2020, 6:58 AM IST

కరోనా మహమ్మారి విజృంభణపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వార్షిక సదస్సులో ఐరోపా సంఘం, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాల కూటమి తీసుకొస్తున్న ప్రతిపాదనను భారత్‌ సమర్థించింది. చైనాను దృష్టిలో పెట్టుకొని దీన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే అందులో ఎక్కడా ఆ దేశం పేరును ప్రస్తావించలేదు.

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌.. జంతువుల నుంచి మానవుల్లోకి ప్రవేశించిన తీరు, ఈ మహమ్మారిపై డబ్ల్యూహెచ్‌వో స్పందనపై నిష్పాక్షిక మదింపు చేపట్టాలని ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ముసాయిదా ప్రతి కూడా సిద్ధమైంది. సోమవారం నుంచి జరిగే డబ్ల్యూహెచ్‌వో వార్షిక ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ)లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌పై భారత్‌ లాంఛనంగా తన వైఖరిని వెల్లడించడం ఇదే మొదటిసారి. మహమ్మారి ఆరంభమైన తొలినాళ్లలో సమాచారాన్ని చైనా దాచిపెట్టిందని విమర్శలు వచ్చాయి.

ముసాయిదా తీర్మానంలోని అంశాలివీ..

కరోనా వ్యాప్తి విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తెచ్చేందుకు ఈ తీర్మానాన్ని తెస్తున్నట్లు జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో పలువురు దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ఈ ఏడు పేజీల ముసాయిదా తీర్మానంలో చైనా, వుహాన్‌ పేర్లు ఎక్కడా లేవు. ఈ తీర్మానంలో 'దర్యాప్తు'నకు బదులు 'మదింపు' అనే పదాన్ని చేర్చారు.

  • సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు మూలం ఏ జంతువు? ఇది మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? మధ్యలో ఏదైనా జంతువు పాత్ర పోషించిందా? వంటి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి భాగస్వామ్యంతో కూడిన క్షేత్రస్థాయి శాస్త్రీయ పరిశోధనలకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ చర్యలు తీసుకోవాలి.
  • కొవిడ్‌ను ఎదుర్కొనే అంశంలో గడించిన అనుభవాన్ని, నేర్చుకున్న పాఠాలపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర మదింపు జరిపేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్ల్యూహెచ్‌వోలోని వ్యవస్థల సమర్థతపై విశ్లేషణ చేయాలి. కొవిడ్‌-19 మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్‌వో చర్యలు, వాటిని ఎప్పుడు చేపట్టారు వంటి అంశాలపై మదింపు వేయాలి
  • అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా కొవిడ్‌-19 మహమ్మారికి సంబంధించిన ప్రజారోగ్య సమాచారాన్ని సకాలంలో, అత్యంత కచ్చితత్వంతో డబ్ల్యూహెచ్‌వోకు అందించాలి.

అమెరికా దారెటు?

వర్చువల్‌ సమావేశం ద్వారా ఈ ముసాయిదాపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానానికి జపాన్‌, టర్కీ, రష్యా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా మద్దతు తెలిపాయి. అయితే దీనికి మద్దతు ఇచ్చే అంశంపై అమెరికా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. అలాగే ఈ వ్యవహారంలో చైనాను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు ఈ తీర్మానాన్ని చైనాలోని భారత రాయబారి సన్‌ వెయిడాంగ్‌ తప్పుపట్టారు. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌.. వుహాన్‌ ల్యాబ్‌ తయారు చేసిందని కానీ అక్కడి నుంచి లీకైందని కానీ చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో, వైద్య పత్రిక 'లాన్సెట్‌'తోపాటు పలు దేశాల నిపుణులు పేర్కొన్నారని తెలిపారు.

ఇదీ చూడండి:'చైనా కావాలనే విదేశాలకు జనాల్ని పంపింది'

ABOUT THE AUTHOR

...view details