భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది. గడచిన ఏడాది కాలంలో క్యాలిఫోర్నియా, ఆస్ట్రేలియాల్లో తలెత్తిన కార్చిచ్చుల వల్ల భారీ విస్తీర్ణంలో అడవులు బూడిదై ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. గత నెలలో కేరళలోని త్రిసూర్ జిల్లాలోని అడవుల్లో ఎగిసిపడ్డ కార్చిచ్చులను నియంత్రించే క్రమంలో ముగ్గురు అటవీ సిబ్బంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించింది. తరచూ నల్లమలతో పాటు దేశంలోని హిమాలయాలు, తూర్పు, పశ్చిమ కనుమల్లోని అడవుల్లో తలెత్తే అగ్నిప్రమాదాలు అనూహ్య నష్టాలు మిగుల్చుతున్నాయి. అడవుల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భమైనా- మానవాళి ఆలోచన ధోరణిలో మార్పు రగిలిస్తే మేలు!
దావానలంతో కష్టకాలం
పెరుగుతున్న జనాభా, అవసరాలతో పాటు విధానపరమైన లోపాలు అడవుల క్షీణతకు ప్రధాన కారణాలు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో విస్తరిస్తున్న అగ్నిప్రమాదాలు మరిన్ని సవాళ్లు విసరుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, సుదీర్ఘ వేసవికాలం, మానవ తప్పిదాలవల్ల ఏర్పడే దావానలాలతో భారీ విస్తీర్ణంలో పచ్చని, దట్టమైన అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా ప్రకారం ఏటా 60లక్షల నుంచి కోటి నలభై లక్షల హెక్టార్ల మేర అడవులు అగ్నిప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ మంటల్లో విలువైన వృక్ష సంపద నాశనమైపోవడమే కాకుండా- అరుదైన వన్యప్రాణులు, జీవవైవిధ్య సంపద వినాశనానికి గురవుతున్నాయి. అనేక సందర్భాల్లో సమీపంలోని జనావాసాలకూ తీరని నష్టం కలుగుతోంది.
జీవవైవిధ్యానికి నెలవైన అడవుల్లో..
నిరుడు అమెజాన్, ఆస్ట్రేలియా; 2018లో క్యాలిఫోర్నియా అడవుల్లో రగిలిన కార్చిచ్చులు మునుపెన్నడూ లేని స్థాయిలో నష్టం కలిగించాయి. బ్రెజిల్, బొలీవియా, పెరు, పరాగ్వేలలో విస్తరించిన అమెజాన్ అడవులు భూగోళం మీద అత్యంత విలువైన జీవవైవిధ్యానికి నెలవైనవి. ఈ అడవుల్లో గతేడాది జనవరి నుంచి అక్టోబరు వరకూ 40వేల అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటివల్ల 9.06లక్షల హెక్టార్ల మేర అత్యంత విలువైన, దట్టమైన అడవులు నాశనమయ్యాయి. నిరుడు ఆస్ట్రేలియా అడవుల్లో ఏర్పడ్డ దావానలాలు ప్రపంచాన్ని వణికించాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 33మంది మృత్యువాత పడ్డారు. లక్షా 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. 5,900 వరకూ భవనాలు అగ్ని ప్రమాదాల బారిన పడి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాలను సైతం కార్చిచ్చులు కష్టాలపాల్జేస్తున్నాయి.
బూడిదపాలైన 70 లక్షల హెక్టార్ల అడవులు..
గడచిన రెండు దశాబ్దాల్లో తలెత్తిన 72,400 అగ్నిప్రమాదాల్లో 70లక్షల హెక్టార్ల మేర అడవులు భస్మీపటలమయ్యాయి. భారత్‌లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. క్యాలిఫోర్నియాలో 7.2లక్షల హెక్టార్లలోని అటవీ భూములు, గడ్డినేలలు కాలి బూడిదయ్యాయి. గత నెలలో జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్క 2019లోనే దేశంలోని అటవీ ప్రాంతాల్లో 30 వేల కార్చిచ్చులు ఏర్పడ్డాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. 2004-2017 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అడవుల్లో 2,77,758 చోట్ల కార్చిచ్చులు రగిలి అగ్నిప్రమాదాలు తలెత్తాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవులపై అటవీ యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ జరుపుతుంది. దేశంలో ఎక్కడైనా సరే- అడవుల్లో కార్చిచ్చు రగిలిన వెంటనే ఉపగ్రహ సాయంతో సంబంధిత ప్రాంతంలోని సిబ్బందిని మొబైల్ సంక్షిప్త సందేశాల ద్వారా అప్రమత్తం చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అటవీ యంత్రాంగం వినియోగిస్తోంది. భారత్‌లో అవసరాలకు సరిపడా అటవీ యంత్రాంగం లేదు. ఆర్థిక, రవాణా వనరులూ పరిమితం. రహదారులు లేని మారుమూల పర్వత ప్రాంతాల్లోని అడవుల్లోకి చేరుకునేలోపే నష్టం భారీగా నమోదవుతోంది. దేశంలో ఫిబ్రవరి-జూన్ మధ్యకాలంలో దట్టమైన అటవీ ప్రాంతాలున్న హిమాలయాలు, పశ్చిమ, తూర్పుకనుమల్లో కార్చిచ్చులు రగలడంవల్ల నష్టతీవ్రత అధికంగా ఉంటోంది.
ఉమ్మడిగా కృషి చేస్తున్నా..
అడవుల పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడంలేదు. భారత్‌లో జాతీయ విధానంలో సవరణలు తీసుకొచ్చి అడవుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేసే ప్రక్రియను దశాబ్దాల క్రితమే ప్రారంభించారు. ఉమ్మడి, సామాజిక అటవీ యాజమాన్యాల వంటి పథకాల పేరుతో అటవీ సిబ్బంది, అడవులపై ఆధారపడి జీవించే ప్రజలు సంయుక్తంగా అటవీ రక్షణ చర్యలు చేపట్టినా ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో రెండు దశాబ్దాల క్రితం అనేక రాష్ట్రాల్లో ఉమ్మడి అటవీ యాజమాన్య పథకం ఉత్సాహంగా ప్రారంభమయింది. ఈ పథకం ద్వారా అడవులపై ఆధారపడే ప్రజలకు జీవనోపాధి కల్పించడంతో పాటు వనాల పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయడంతో ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పథకం కింద అడవుల్లోని స్థానిక సమూహాలతో ఏర్పాటైన వనసంరక్షణ సమితుల సభ్యులు అగ్నిప్రమాదాల నివారణ, సమాచారం అందించడం వంటి విషయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించేవారు. తరవాత నిధుల కొరతవల్ల వన సంరక్షణ సమితులకు ప్రాధాన్యం తగ్గడంతో లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులు ఏర్పడ్డాయి.