తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధరల మంటతో ఉడకని పప్పులు - latest editorial news

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, పోషకాలు కావాలి. అటువంటి ప్రొటీన్లు పప్పుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇటీవల వీటి ధర పెరిగడం వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు వీటి సాగు కూడా ఏటా తగ్గుతోంది. ఇందుకు కారణాలేంటి?. సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటి?

Increased pulse prices .. Nutrition distance for the poor
పెరిగిన పప్పు ధరలు.. పేదవాడికి పోషకాహారం దూరం

By

Published : Jan 4, 2020, 8:05 AM IST

మనిషి ఆరోగ్యానికి మాంసకృత్తులు(ప్రొటీన్లు) కీలకం. ఇవి పప్పుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని పేదల మాంసాహారంగా పోషకాహార నిపుణులు అభివర్ణిస్తారు. చికెన్‌, మటన్‌, చేపల కన్నా పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారంలోని ప్రొటీన్లకన్నా పప్పుధాన్యాల్లో ఉండేవే ఎక్కవ ఆరోగ్యకరం. ధనిక, పేద అనే తేడా లేకుండా రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలు భాగం. వీటి ధరలు ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరగడం వల్ల పేదలు ఇబ్బందిపడుతున్నారు. తలసరి పప్పుధాన్యాల వినియోగం రోజుకు 50 నుంచి 60 గ్రాములు ఉండాలని పోషక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత తలసరి లభ్యత సుమారు 40 గ్రాములకు మించి లేదు. మనుషుల్లో ముఖ్యంగా పిల్లల్లో పౌష్టికాహార లోపానికి ఇది ఒక కారణం. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంతో పోల్చితే, పప్పుధాన్యాల సాగు 60 వేల ఎకరాలు తగ్గింది. కంది విస్తీర్ణం 25వేల ఎకరాలు పడిపోయింది. మినుము సాగు 1.40 లక్షల ఎకరాల వరకూ తగ్గింది. పెసరసాగు సగానికి సగం పడిపోయింది. దీంతో ధరలకు రెక్కలు వస్తాయి. రాష్ట్రంలో కందిని 5.90 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ పంట జనవరి మధ్యలో విపణికి వస్తుంది.

సాగులో స్వావలంబన

దేశంలో అపరాల వార్షిక వినియోగం 2.46 కోట్ల మెట్రిక్‌ టన్నులు. ఉత్పత్తి 1.7 కోట్ల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. జనాభా వృద్ధితోపాటు పప్పుధాన్యాల వినియోగమూ పెరుగుతోంది. ఈ కొరతను దిగుమతుల ద్వారా పూడ్చాల్సి వస్తోంది. ఫలితంగా ఖజానాపై భారం పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు స్వావలంబన ఒక్కటే మార్గం. దిగుమతులను తాత్కాలిక ఉపశమన చర్యలుగానే భావించాలే తప్ప, వాటినే శాశ్వత పరిష్కారాలుగా భావించరాదు. పప్పులకు కనీస మద్దతుధర ప్రకటిస్తే రైతులు వాటిని పండించడానికి ఆసక్తి చూపుతారు. మిగతా నిత్యావసర సరకుల మాదిరిగా వీటిని కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి తేగలిగితే అటు రైతుకు ఆదాయ భద్రత, ఇటు సామాన్యుడికి ఆహార భద్రత సమకూరుతుంది. అంతర్జాతీయ విపణిలో పప్పు దినుసులు కొనుగోలు చేసేకన్నా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒప్పంద ప్రాతిపదికన పండించడం లాభదాయకమన్నది నిపుణుల అభిప్రాయం. అందువల్ల ఆయా దేశాల ప్రభుత్వాలతో రైతులు ఒప్పందాలు కుదుర్చుకునే అంశాన్ని కేంద్రం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది కూడా తాత్కాలిక తోడ్పాటే తప్ప, శాశ్వత పరిష్కారం కాదు. స్వావలంబన ఒక్కటే శాశ్వత పరిష్కారం కాగలదు. గత పాతికేళ్లుగా అపరాల దిగుబడి తగ్గుతున్నా, పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఎన్డీయే-1 ప్రభుత్వం మర పట్టని కందిపప్పును కిలో రూ.60, మినుములు రూ.80 చొప్పున కొని రాష్ట్రాలకు అందించి, వాటిని కిలో రూ.120 చొప్పున విక్రయించమని ఆదేశించింది. ప్రభుత్వాలే ఇంతగా లాభదాయక కోణంలో ఆలోచిస్తే ఇక ప్రైవేట్‌ వ్యాపారుల గురించి చెప్పక్కర్లేదు.

దేశంలో హరిత విప్లవం ప్రభావంతో వరి, గోధుమ సాగుబడి పెరిగింది. సాగు పెరగడంతో భూగర్భ జలాలు పడిపోయాయని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. ఫలితంగా అపరాల సాగు అప్రధాన అంశమైపోయింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం వరకు ప్రధాన పంటగా పప్పుధాన్యాలనే సాగుచేసిన పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో సేద్య ప్రాథమ్యాలు మారాయి. వీటికన్నా వరి, గోధుమ సాగు లాభదాయకం కావడమే ఇందుకు కారణమన్నది రైతుల భావన. దేశంలో అపరాల సాగు విస్తీర్ణంలో 88 శాతం వర్షాధారమే. 2022 ఆగస్టు నాటికి పప్పుధాన్యాలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండరాదని ఇటీవల ప్రధాని మోదీ పిలుపిచ్చారు. తనకున్న భూమిలో కనీసం అయిదోవంతు విస్తీర్ణంలో ప్రతి రైతు అపరాల సాగు చేయాలని కోరారు. ఇతర పంటల కంటే ఈ పంట సాగు లాభదాయకం అయ్యేలా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తేనే ప్రధాని కోరిక నెరవేరుతుంది.

చిన్న దేశాలైన టాంజానియా, కెన్యా, మొజాంబిక్‌, బర్మా వంటి దేశాలు భారత్‌కు ఎగుమతి చేయగల స్థాయికి ఎదిగాయి. వర్షాధార నేలల్లో అపరాల సాగులో బ్రెజిల్‌, అర్జెంటీనా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. పప్పుధాన్యాల కోసం భారత్‌ దిగుమతులపై ఆధారపడుతోంది. తనకన్నా తక్కువ విస్తీర్ణంలో అపరాలు సాగుచేస్తున్న దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది. కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి బఠానీలు; మియన్మార్‌, టాంజానియా, కెన్యాల నుంచి మినుములు, పెసలు; టాంజానియా, రష్యా, ఆస్ట్రేలియాల నుంచి శెనగలు దిగుమతి చేసుకుంటోంది. బ్రెజిల్‌, కెనడా, మియన్మార్‌ అధిక దిగుమతినిచ్చే నూతన రకాలకు పెద్దపీటవేసి ఉత్పాదకతను పెంచుకోగలిగాయి. ఉత్పాదకత విషయంలో అమెరికా, చైనా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా సరసన భారత్‌ రికార్డు వెలాతెలాపోతోంది. హెక్టారుకు అపరాల ఉత్పాదకత ఫ్రాన్స్‌లో (4,219 కిలోలు), కెనడాలో (1,936), అమెరికాలో (1,882), రష్యాలో (1,643) ఉండగా, భారత్‌ 648 కిలోలతో ఎంతో వెనకబడి ఉంది. భారత్‌కన్నా చైనాలో సాగు విస్తీర్ణం తక్కువే. అయినప్పటికీ సగటు దిగుబడి అక్కడే ఎక్కువ.

నష్టపోతున్న రైతన్న

దేశంలో అపరాల సాగు, వినియోగంలో అంతరాలు ఉన్నాయి. అపరాలు పండిస్తున్న 400లకు పైగా జిల్లాల్లో 80 శాతం పంట దిగుబడి 20 శాతం కన్నా తక్కువ జిల్లాల్లోనే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. ఇవన్నీ ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో గల వర్షధార ప్రాంతాలే. పప్పు దినుసుల ధరలు పైకెగబాకడం వల్ల, వాటితో తయారు చేసే ఇతర పదార్థాల ధరలూ పెరుగుతాయి. ఉదాహరణకు మినప, పెసర, శనగపప్పు ధరలు పెరగడం వల్ల అల్పాహార ధరలకు రెక్కలొస్తాయి లేదా వాటి నాణ్యత తగ్గుతుంది.

గతంలో పప్పు ధాన్యాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎన్డీయే-1 ప్రభుత్వం నియమించిన అరవింద సుబ్రమణ్యన్‌ కమిటీ ఇటు వినియోగదారులకు, అటు రైతులకు మేలుచేసే సూచనలను ప్రతిపాదించింది. ఒక ఏడాది పప్పుధాన్యాలు బాగా పండితే మరుసటి సంవత్సరం రైతులందరూ అదే పంట వేయడం సాధారణం. ఫలితంగా సరఫరా పెరిగి, ధరలు తగ్గుముఖం పడతాయి. దీనివల్ల రైతులు నష్టపోతారు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా రైతులు జాగ్రత్త పడాలి. నేడు అనేక బహుళజాతి సంస్థలు పప్పుల వ్యాపారంలోకి ప్రవేశించాయి. అవి రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వినియోగదారుడు చెల్లించే ధరలో రైతుకు వచ్చేది 30 నుంచి 40 శాతమే. జాతీయ నమూనా సర్వే ప్రకారం దళారులు పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ధరలు విజృంభించినప్పుడు ప్రభుత్వాలు అక్రమ నిల్వలపై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలి. ‘టోల్‌ ఫ్రీ నంబరు’ను ప్రకటించాలి. ఫలానాచోట అక్రమ నిల్వలున్నాయని తెలుసుకుని అధికారులు దాడులు చేయడానికి ఈ నంబరు ఉపకరిస్తుంది. పప్పు దినుసుల విషయంలో ‘ఫ్యూచర్‌ ట్రేేడింగు’ను అరికట్టాలి. దిగుమతులు తగ్గించుకుని, దిగుబడులు పెంచే దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే కొంతవరకైనా పప్పు ధాన్యాల కొరతను అధిగమించగలం!

దేశవ్యాప్తంగా కందిపప్పు వినియోగం

కందిపప్పు వినియోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం. తొలి రెండు రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఏడాదికి సుమారు అయిదు లక్షల మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం. ఉత్పత్తి మాత్రం 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడికే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే, తెలంగాణలో కంది సాగు విస్తీర్ణం ఎక్కువ. దిగుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం. దేశానికి అవసరమైన పంటలో 30 శాతం మహారాష్ట్రలో పండుతోంది. 17 శాతంతో కర్ణాటక, 13 శాతంతో మధ్యప్రదేశ్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్నది కేవలం ఎనిమిది శాతమే.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ పంటగానే కాకుండా, అంతర పంటగానూ కంది సాగును ప్రోత్సహిస్తున్నారు. కంది, మినుముల వినియోగం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. యూపీలోనూ వీటి వినియోగం అధికమే. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ప్రజలు కందిపప్పును బాగా వినియోగిస్తారు. ఉత్తర, పశ్చిమ భారతాల్లో సెనగపప్పు వాడకం అధికంగా ఉంది. జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా కొన్ని రకాల అపరాల విత్తనాలను 33 శాతం రాయితీపై ఇస్తున్నారు. పప్పుధాన్యాల ధరలు పెరిగినప్పుడల్లా కొంతమంది వ్యాపారులు వాటిని అక్రమంగా నిల్వచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 అక్టోబరు 26-31 తేదీల మధ్య చేసిన దాడుల్లో 3,854.64 క్వింటాళ్ళ కందిపప్పును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 127 మంది అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలోనూ దాడులు జరిగాయి.

ఆచార్య పి. వెంకటేశ్వర్లు

(ఆంధ్ర విశ్వ విద్యాలయ వాణిజ్య విభాగ ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details