భారతీయుల ఆత్మగా ప్రథమ ప్రధాని నెహ్రూ అభివర్ణించిన పావనగంగ కొన్నేళ్లుగా విపరీత కాలుష్య ఉద్ధృతితో జీవకళ కోల్పోతోంది. నదీజలాల్ని మాతృస్వరూపంగా సంభావించే సంస్కృతి మనది. కాశీ వెళ్ళివచ్చిన పరిచయస్తులెవరైనా అక్కడినుంచి తెచ్చిచ్చిన గంగా జలాల్ని భక్తిభావనతో తలపై జల్లుకోవడం ఈ గడ్డమీద కోట్లాది పౌరులకు ఆనవాయితీగా స్థిరపడింది. అటువంటి అసంఖ్యాకుల్ని దిగ్భ్రాంతపరచేలా- గంగాజలాలు ఎక్కడెక్కడ స్నానానికి పనికిరాని దుస్థితికి చేరిందీ యూపీ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా వివరాలు క్రోడీకరించింది.
ఆ జాబితాలో కాన్పూర్, ప్రయాగ్ రాజ్, ఘాజీపూర్, వారణాసి జిల్లాలు ముందున్నాయి. అక్కడి నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఎంతగా పేరుకుపోయిందో చాటుతున్న గణాంక వివరాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఆమధ్య 86 పర్యవేక్షణ కేంద్రాలు నెలకొల్పి ‘కోలీఫాం’ ఉనికిపై సమాచారం రాబట్టిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చాలాచోట్ల గంగాజలాలు తాగడానికి యోగ్యం కావని నిర్ధారించింది.
ప్రతిరోజూ అయిదు రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద ప్రధాన పట్టణాలనుంచి 300 కోట్ల లీటర్ల మేర వచ్చి కలుస్తున్న మురుగునీరు గంగానది జీవాత్మను ఛిద్రం చేస్తోంది. ‘నమామి గంగే’ పద్దుకింద వేలకోట్ల రూపాయలు వ్యయీకరించిన తరవాతా- జలకాలుష్యం ఆగకుండా ప్రబలుతూనే ఉంది. 800 కిలోమీటర్ల పరిధిలో రెండు వందల పాతికకుపైగా మురుగునీటి కాల్వల నుంచి నేరుగా గంగలో చేరుతున్న మలిన ప్రవాహాలను కట్టడి చేసేందుకంటూ ప్రత్యేకంగా కొలువు తీర్చిన ఇంజినీర్ల బృందం ఎక్కడ ఏం బాధ్యతల్లో తలమునకలై ఉందో తెలియదు! గంగ ఒక్కటే అనేముంది- భూగర్భ, ఉపరితల జలాల పరిరక్షణకు, వ్యర్థాల సమర్థ నిర్వహణకు ఉద్దేశించిన చట్టాలు ఆచరణలో చట్టుబండలై- దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో నదులు జీవావరణానికే ఉరితాళ్లు పేనుతున్నాయి.
పారిశ్రామిక వ్యర్థాలు, ఇతరత్రా కాలుష్యాల జంటదాడి పాలబడి సహజ స్వరూపస్వభావాలు కోల్పోయి కశ్మల కాసారాలైన నదీ ప్రవాహ ప్రాంతాల సంఖ్య దేశంలో పదేళ్ల క్రితం 121. తరవాతి ఆరు సంవత్సరాల్లో మూడు వందలకు మించినవాటి సంఖ్య, సీపీసీబీ గణాంకాల ప్రకారం- నిరుడు 350కి పైబడింది. అందులో మహారాష్ట్ర, అసోం, గుజరాత్‌లదే పైచేయి. పేరుకు దేశంలో దాదాపు 450 నదులున్నా- సగానికి పైగా తాగడానికి, నాలుగోవంతు స్నానానికీ పనికిరానివేనని వివిధ అధ్యయనాలు నిగ్గుతేల్చాయి.
‘జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక’ను అధికారికంగా పట్టాలకు ఎక్కించినా ఏళ్ల తరబడి ఒరిగిందేముంది? ప్రేతకళ ఆవరించిన నదుల జాబితా ఆగకుండా విస్తరిస్తూనే ఉంది. 16 రాష్ట్రాల్లోని 77 పట్టణాల పరిధిలోని 34 కలుషిత నదీప్రాంతాల సముద్ధరణకు రూ.5,870 కోట్లు, గంగను పునరుత్తేజితం చేసేందుకంటూ రూ.20 వేలకోట్ల మేర బడ్జెట్లు కంటికి నదరుగా ఉన్నా- దీటైన కార్యాచరణకు నోచడంలేదు.
పంజాబ్, హరియాణా, రాజస్థాన్లలో ప్రవహిస్తూ కోటిమంది జీవితాలతో చెలగాటమాడుతున్న సట్లెజ్ నదీ కాలుష్య కట్టడికి కేంద్రసాయం ఎండమావిని తలపిస్తోందన్న విమర్శలు మోతెక్కుతున్నాయి.