చైనాకు చెందిన పలు సంస్థలు భారత్‌లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. కొందరు భారతీయుల సహకారంలో పలువురు చైనీయులు బోగస్ సంస్థలు సృష్టించి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో.. చైనా సంస్థలపై మంగళవారం దాడులు నిర్వహించింది ఐటీశాఖ. దిల్లీ, గురుగ్రామ్, గాజియాబాద్‌లో 20కిపైగా చోట్ల విస్తృత సోదాలు నిర్వహించింది.
బోగస్ సంస్థల పేరుతో చైనీయులు 40 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తనిఖీల అనంతరం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. వీటి ద్వారా దాదాపు రూ.1000కోట్ల వరకు అక్రమ నగదు బదిలీ, హవాలా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దేశంలో రిటైల్ షోరూంలు ప్రారంభిస్తామని ఓ చైనా అనుబంధ సంస్థ రూ.100కోట్లు బోగస్ అడ్వాన్స్ కూడా తీసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెప్పారు.