రాష్ట్రపతి భవన్ ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి కోవింద్ .. మోదీతో ప్రధానిగా ప్రమాణం చేయించనున్నారు. కొందరు కొత్త మంత్రులూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్లో ఎవరెవరు ఉంటారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. కీలకమైన హోం శాఖ, ఆర్థిక, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తి నెలకొంది.
మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు కేబినెట్ కూర్పుపై వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పలువురు సీనియర్లను కొనసాగించనుండటంతో పాటు.. కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
కేబినెట్లో అమిత్ షా...
కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా భాగం కానున్నారని ఊహాగానాలొస్తున్నాయి. ఈ తరుణంలో అమిత్ మంత్రివర్గంలో చేరుతారా... లేదా అనేది నేడు తేలనుంది. ఒకవేళ ఆయనను మోదీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తే కీలక శాఖ దక్కనుంది.
అయితే.. రానున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు షా.. భాజపా అధ్యక్షుడిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే.. మంత్రివర్గంలోకి తీసుకొనే యోచనలో మోదీ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మంత్రివర్గంలో కొనసాగడం కష్టమే. కొత్త కేబినెట్లో తనకు మంత్రి పదవి వద్దని ఇప్పటికే మోదీకి లేఖ రాశారు జైట్లీ.