తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేరగాళ్లకు వింజామరలు - పంద్రాగస్టు

దేశంలో మూక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి పౌరుడి స్వాభిమానాన్ని కాపాడాలసిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇరవయ్యేళ్ల క్రితమే స్పష్టీకరించింది. ఇప్పటికీ నేర రహిత సమాజం అన్నది పగటి కలగానే రుజువవుతోంది. హరియాణాలో 2017లో మూకదాడిలో పెహ్లూఖాన్​ మరణించిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఘటనకు ముందు, ఆ తర్వాత ఉన్మాద మూకదాడుల ఘోరాలు అభాగ్యుల ప్రాణాల్ని బలిగొంటూనే ఉన్నాయి. బిహార్​లో ఈనెల తొలి వారం నాటికే పక్షం రోజుల వ్యవధిలో 12 మూక దాడుల కేసులు నమోదయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటి? సమస్యకు పరిష్కారం తీరకపోవడానికి లోపం ఎక్కడుంది?

నేరగాళ్లకు వింజామరలు

By

Published : Aug 19, 2019, 6:17 PM IST

Updated : Sep 27, 2019, 1:25 PM IST

‘ఎప్పుడు ఏ పౌరుడి స్వాభిమానం గాయపడినా, నాగరికత వెనకడుగు వేసినట్లే... అలాంటి ప్రతి సందర్భంలోనూ మానవతా పతాకాన్ని అవనతం చేయాల్సిందే’నని సుప్రీంకోర్టు స్పష్టీకరించి ఇరవయ్యేళ్లయింది. నేర రహిత సమాజం అన్నది పగటికలగా రుజువవుతున్న ఈ రోజుల్లో నేరాలకు తగ్గ శిక్షలు గట్టిగా అమలవుతుంటేనన్నా అనాగరిక దుశ్చేష్టలు దుర్మార్గాలు అదుపులో ఉంటాయి. అందుకు పూర్తి భిన్నంగా పౌరుల స్వాభిమానం మాట అటుంచి, ప్రాణాలకే దిక్కులేని వాతావరణం దినదిన ప్రవర్ధమానం అవుతున్న పాడుకాలంలో ఉన్మాద మూకస్వామ్యం జడలు విప్పుకొంటోంది. భారతావని సహనశీలతపైనే గొడ్డలి వేటు అనదగ్గ ఘోరనేరాలు జరిగినప్పుడన్నా చట్టం తన పని తాను సక్రమంగా చేయకపోవడంతో దోషులు దర్జాగా తప్పించుకొనేలా న్యాయస్థానాల తీర్పులు వెలువడుతున్నాయి. ‘సుప్రీం’ చెప్పినట్లు మానవతా పతాకాన్ని అవనతం చేయాల్సిన రీతిలో అదనపు జిల్లా జడ్జి ఒకరు పంద్రాగస్టుకు ముందునాడు వెలువరించిన తీర్పు- ఎక్కడికక్కడ చట్టబద్ధ పాలన చట్టుబండలైన దురవస్థకు నిఖార్సైన నిదర్శనగా నిలుస్తోంది!

హరియాణాలోని జైసింగ్‌పురాకు చెందిన పాడి రైతు పెహ్లూఖాన్‌(55) రాజస్థాన్‌లోని జైపూర్‌ సంతలో ఆవుల్ని కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఆల్వార్‌ జిల్లా బహ్రోర్‌ దగ్గర మూకదాడిలో హతమారిపోయాడు. పెహ్లూఖాన్‌తో పాటు ఉన్న అతడి ఇద్దరు కొడుకులు, సాటి గ్రామస్తులపై 2017 ఏప్రిల్‌ ఒకటిన జరిగిన మూకదాడి సచిత్ర సాక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయిందప్పుడు! రెండేళ్లకు పైగా సాగిన ఆ కేసు విచారణలో ముద్దాయిలందరికీ సంశయలాభం (బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌) ఇస్తూ జడ్జి విడిచిపుచ్చారు. సాక్షులు ఎవరూ ముద్దాయిల్ని గుర్తించలేదని, ప్రాసిక్యూషన్‌ వారు మూకదాడి వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షకు పంపలేదని నిందితుల తరఫు న్యాయవాది వివరణాత్మకంగా స్పందించారు. నిందితులంతా నిర్దోషులైతే, మా తండ్రిని చంపిందెవరు?- అన్నది పెహ్లూఖాన్‌ తనయుడి సూటి ప్రశ్న. సమాధానం చెప్పగల స్థితిలో భారత నేర న్యాయ వ్యవస్థ లేకపోవడం ఏమిటన్నదే సగటు పౌరుడి చింత!

‘నేరాలు నిజం- శిక్షలు మిథ్య’గా దేశం పురోగమిస్తున్న తీరు రక్షకభట యంత్రాంగం అద్భుత పనిపోకడలకు తిరుగులేని సంకేతంగా భాసిస్తోంది. ఒకటో తేదీన తీవ్రంగా గాయపడిన పెహ్లూఖాన్‌ తమపై దాడికి పాల్పడిన ఆరుగురు పేర్లను మరణ వాంగ్మూలం ఇచ్చి ఏప్రిల్‌ మూడున కన్నుమూశాడు. ఖాన్‌ బృందంపై దాడి చేసినవారి మీద కాకుండా, పశువుల అక్రమ రవాణా చట్టం కింద క్షతగాత్రుల మీదే రాజస్థాన్‌ పోలీసులు రెండో తేదీన కేసు నమోదు చేశారు! ఏప్రిల్‌ అయిదున దుండగులపై హత్యకేసు నమోదు చేసి, వారి సమాచారం అందిస్తే రూ.5,000 నజరానా సైతం ప్రకటించారు. తరవాత ఒక్కొక్కరుగా ఆరుగుర్ని అదుపులోకి తీసుకొన్న పోలీసులు- మే 11న విచారణ అధికారిని మార్చేశారు. 2017 జులై తొమ్మిదిన మరోమారు చేతులు మారి కేసు సీబీసీఐడీ చేతికి వెళ్ళింది. దరిమిలా రెండు నెలలకే నిందితులందరికీ పోలీసులు ‘క్లీన్‌చిట్‌’ ఇచ్చేశారు. దాడిలో తగిలిన గాయాలవల్లనే పెహ్లూఖాన్‌ మరణించాడని ముగ్గురు ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నివేదిక ఇచ్చినా, దాన్ని కాదని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల వాంగ్మూలాన్నే పోలీసులు ప్రామాణికంగా తీసుకొన్నారు. ఖాన్‌ గుండెపోటుతో మరణించాడన్నది వారి నివేదిక సారాంశం. నేరగాళ్ల ప్రయోజనాలకు అనుగుణంగా సాక్ష్యాలను మార్చి సాక్షుల్ని ఏమార్చి పోలీసులు చేస్తున్న ‘పరిశ్రమ’ కోట్లాది న్యాయార్థుల ఉసురు పోసుకొంటోందన్నది యథార్థం!

దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ‘స్మార్ట్‌’గా రూపాంతరం చెందాలని ప్రధాని మోదీ పిలుపిచ్చి కొన్నేళ్లయింది. ‘స్మార్ట్‌’ అంటే ‘నిక్కచ్చితనం, మృదుస్వభావం, ఆధునికత వేగం, జాగరూకత, జవాబుదారీతనం, విశ్వసనీయత, స్పందించే నైజం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ’ల కలబోతగా పోలీసు సేవలు పదును తేలాలన్న మోదీ ఆకాంక్ష అక్షరాలా నీరోడుతోంది. రాజకీయ ప్రమేయం గల కేసుల్లో కేదస (సీబీఐ) పనితీరు అధ్వానంగా ఉందని ఈమధ్యే భారత ప్రధాన న్యాయమూర్తి నిష్ఠుర సత్యం పలికారు. ఆ విషయంలో పోలీసులకు సరిసాటి రాగల యంత్రాంగం మరొకటి లేదు! రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగం రాజకీయమనే పొట్టిపేరు తగిలించుకొని ఊరేగుతుంటే, రాజకీయ బాసుల ఇష్టాయిష్టాలే నయా చట్టాలుగా, ఆ క్రమంలో నేరగాళ్ళే అక్కరకొచ్చే చుట్టాలుగా పోలీసు వ్యవస్థ తనను తాను ఏనాడో సంస్కరించుకొంది!

ఓ పసికందును చిదిమేసిన కేసులో తగిన సాక్ష్యాలు లేవంటూ ఓ నిందితుణ్ని విడిచిపెట్టిన సుప్రీంకోర్టు- దేశీయంగా నేర న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను తానే వేలెత్తిచూపింది. దర్యాప్తు, విచారణ అధికారుల్లో జవాబుదారీతనం కొరవడటమే సరైన సాక్ష్యాలు లేకుండాపోవడానికి కారణమంటూ, అందుకుతగ్గ వ్యవస్థను ఆర్నెల్లలోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించీ కొన్నేళ్లయింది. పోలీసుల దర్యాప్తు అసమర్థతకు పరాకాష్ఠగా, ప్రాసిక్యూషన్‌ యంత్రాంగంతో సమన్వయంలేక, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో రాజకీయ జోక్యం పెరిగి- నేరన్యాయ వ్యవస్థ పట్టాలు తప్పిందని న్యాయసంఘమూ మొత్తుకొంది. ఎంత పెద్ద నేరానికి ఒడిగట్టినా బేఫర్వా అన్న దిలాసా నాగరిక సమాజం కుదుళ్లనే పెకలించేస్తుంది. ‘ఒక్కొక్క మత హింసాత్మక చర్యతో క్రీస్తును పదేపదే సిలువ వేస్తున్నాం... మహాత్ముడిని పలుమార్లు హత్య చేస్తున్నాం’- అని ఆరేళ్ల నాటి ముజఫర్‌ నగర్‌ అమానుష నరమేధం నేపథ్యంలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన చెందారు. పౌరుల జీవన హక్కునే కర్కశంగా చిదిమేసే ఉన్మాద సంస్కృతికి ఊతమిచ్చేలా రక్షక భటుల నిష్క్రియాపరత్వమే శాంతిభద్రతలకు పెనుప్రమాదంగా పరిణమించిందిప్పుడు!

‘పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు... తమకు తామే చట్టంగా మారకూడదు’ అన్నది నాగరిక జీవనసారం. ఆ స్ఫూర్తికి గొడుగుపడుతూ మూకస్వామ్య ఘోరాల్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న సుప్రీంకోర్టు నిరుడు జులైలో ఇచ్చిన విపుల తీర్పు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మార్గనిర్దేశం. దురదృష్టం ఏమిటంటే, ‘సుప్రీం’ జోక్యానికి ముందూ ఆ తరవాతా ఉన్మాద మూకల ఘోరకలి అభాగ్యుల ప్రాణాల్ని బలిగొంటూనే ఉంది. ‘పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్లు వచ్చా’రన్న అలజడి ఇరవైమంది ప్రాణాల్ని బలిగొంది. మూకస్వామ్య హత్యల్ని తీవ్రంగా పరిగణించి శిక్షించేందుకు కొత్తచట్టం తెచ్చే అవకాశం పరిశీలించాలని సుప్రీంకోర్టు పార్లమెంటుకు సూచించింది. అదే సమయంలో 23 విస్పష్ట సూచనలతో ఆ తరహా అరాచకాల్ని కాచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆ ఆదేశాలు జారీ అయ్యి ఏడాది గడచినా ఎక్కడి గొంగడి అక్కడే ఉండటంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు కేంద్రానికి, పది రాష్ట్రాలకు నోటీసులు పంపింది. ఈ నెల తొలివారం నాటికే బిహార్లో పక్షం రోజుల వ్యవధిలో 12 మూకదాడుల కేసులు నమోదు కావడం- పోనుపోను పరిస్థితి విషమిస్తోందనడానికి సంకేతం. పోలీసు యంత్రాంగాన్ని ఆమూలాగ్రం సంస్కరించనంతకాలం- రాజ్యం నేరభోజ్యం. ఏమంటారు?

- పర్వతం మూర్తి

ఇదీ చూడండి:'బోగస్ ఓటర్ కార్డుల ఏరివేతకు 'ఆధార్'​ ఇవ్వండి'

Last Updated : Sep 27, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details