తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాము కాటుకు డాక్టర్ల హాంఫట్​.. హోంఫట్​ 'భూత వైద్యం'..!

పాముకాటుకు చికిత్స చేయాల్సిన ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్​లో వైద్యులే మంత్రాలు చదివి భూతవైద్యం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, కరీంనగర్, ఖమ్మం వంటి చోట్లు స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులే డాక్టర్లుగా మారి.... 'కారెవ్వరూ వైద్యవృత్తికనర్హమని' నిరూపిస్తున్నారు. ప్రపంచ వైద్యచరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలన్నింటికీ మన ప్రభుత్వాసుపత్రులే వేదికలవుతుండటం- జాతి పూర్వజన్మ సుకృతం.

ప్రభుత్వాస్పత్రుల్లో భూత భవిష్యత్ 'వైద్యం'-పూర్వజన్మ సుకృతం.

By

Published : Nov 14, 2019, 8:03 AM IST

పాము కరిస్తే ఏం చేయాలి? పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఆ బాధా‘సర్ప’దష్టుణ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అక్కడ కాకలుతీరిన భూతవైద్యులుంటారు. బాధితుడికి అక్కడికక్కడే పాముమంత్రమేసి కాపాడేస్తారు. హాంఫట్‌... హూంఫట్‌... స్వాహా... అంతే! మాలావు తాచుపాము విషమైనా సరే- క్షణంలో విరిగిపోవాల్సిందే. ఒట్టూ అమ్మతోడు!

ఆస్పత్రిలో భూతవైద్యులా? ముఖాలు చిట్లించకండి. బుగ్గలు నొక్కుకోకండి. ఎర్రపంచె, ఎర్రబొట్టు, కళ్లలో ఎగబాకే ఎర్రజీరలు, వేపమండలతో వీరంగమేసే వెండితెర భూతవైద్యులనుకుంటున్నారో ఏంటో... తప్పు తప్పు! స్టెతస్కోపాలంకృత తెల్లకోటు అల్లోపతి వైద్యుల్లోనే కొందరు పుణ్యపురుషులు ప్రజారోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక సేవలందిస్తున్నారు.

పాము కాటుకు వైద్యుల మంత్రం

ఈ విషయంలో మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ సర్కారీ దవాఖానా వైద్యశిఖామణుల హస్తవాసి చాలా గొప్పది. నాలుగైదు రోజుల కిందట ఏదో పాము కరిచిందని ఓ పెద్దమనిషిని ఆ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాము కోరలు దిగి అల్లాడిపోతున్న మనిషిని సూదిమందుతో మరింత బాధించడానికి పాపం ఆ వైద్యులకు చేతులు రాలేదు. దాంతో ‘మహా వీర గరుడ సమస్త సర్ప నివారణా దుష్ట సర్ప బంధనం కురు కురు...’ లాంటి పాముమంత్రమేదో చదువుతూ గడ్డిపోచలను తాకిస్తూ ‘నభూత’వైద్యం చేసేశారు ఆ దయార్ద్ర హృదయులు. భూతాలను వదిలించడానికి చింతబరికలు వాడినట్లు, పాముకాటుకు గడ్డిపరకలను వినియోగించిన వీరి అసమాన నైపుణ్యాన్ని దేశమంతా అబ్బురంగా వీక్షించింది. దిష్టి తగులుతుందో ఏం పాడో! అన్నట్లు, ఇంకే దేశ వైద్యులూ అనుకరించకుండా వెంటనే ఈ చికిత్సావిధానానికి ‘పేటెంట్‌’ తీసేసుకుంటే మంచిదేమో!

అద్భుతాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే

ప్రపంచ వైద్యచరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతఘట్టాలన్నింటికీ మన ప్రభుత్వాసుపత్రులే వేదికలవుతుండటం- జాతి పూర్వజన్మ సుకృతం. ‘కారెవ్వరు వైద్యవృత్తికనర్హం’ అన్నది మన ధర్మాసుపత్రుల మౌలిక సిద్ధాంతం. స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులతో సహా ఎవరైనా సరే వైద్యం చేయగలిగే మహిమాన్వితావకాశాన్ని ఈ దవాఖానాలు ఉదారంగా కల్పిస్తుంటాయి. కర్నూలు, కరీంనగర్‌, ఖమ్మం... ఇలా చాలాచోట్ల వీళ్లే వైద్యావతారాలెత్తుతున్నారని జనం గగ్గోలుపెడుతున్నారు కానీ, ప్రభుత్వాస్పత్రుల జాలిగుణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వచ్చిన రోగులకు ఎవరో ఒకరు సూదిమందులు ఇస్తున్నారా లేదా, కట్లు కడుతున్నారా లేదా? అవసరమైతే శస్త్రచికిత్సలు చేసి కుట్లూ వేసేస్తారు... తప్పేముందట? వైద్యులే వచ్చి ఇవన్నీ చేయాలంటే కుదురుతుందా, అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా?

కాబట్టి ‘అవి ప్రభుత్వాసుపత్రులని తెలుసు... అక్కడ వైద్యులుండరనీ తెలుసు’ అని పాడుకుంటూ, ఉన్నవారితో- వాళ్లకు వచ్చిన వైద్యమేదో చేయించుకుని ‘బతుకుజీవుడా’ అనుకోవడం తప్ప జనం చేయగలిగేదీ ఏదీ లేదు. చేస్తే గీస్తే పాలకులే చేయాలి. ప్రభువులు దయతలచి ధర్మాసుపత్రుల్లోని స్వీపర్లు, సెక్యూరిటీగార్డులు, ఇతర సిబ్బంది కోసం ‘మూణ్నెళ్లలో ఎమ్‌బీబీఎస్‌’ లాంటి కోర్సులను అందుబాటులోకి తేవాలి. అప్పుడు వారూ వీరు అన్న బేధభావాలు సమసిపోయి అందరూ తెల్లకోటుధారులవుతారు.

మద్యం మత్తులోనే వైద్యం

అదేదో సినిమాలో కథానాయకుడు తాగేసి శస్త్రచికిత్స చేస్తే ‘ఆయ్‌.. వైద్యమంటే అల్లాటప్పానా?’ అంటూ మేధావులు కోపగించుకున్నారు. కానీ, అంతకు మించిన వైద్యకథానాయకులకు ప్రభుత్వాసుపత్రులే రంగస్థలాలని రోగులు చెవులు కొరుక్కుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ సర్కారీ వైద్యులుంగారు- ‘నన్నెవ్వరాపలేరీ వేళ... నా ధాటికోపలేరీ వేళా...’ అన్నంత స్థాయిలో చండ ప్రచండ రుద్రతాండవం చేశారు. సురాపాన పిపాసి అయిన ఆయన ఆ మత్తులోనే ఆస్పత్రికి వేంచేసి సిబ్బంది మీద చిందులు తొక్కేశారు. ఆస్పత్రి గోడలను దాటిన ఆ ఫెళఫెళారావాలు ఊరు ఊరంతా మార్మోగాయ్‌. అన్నట్టండోయ్‌... రోజూ తాగొచ్చే రోగులకు సేవలందిస్తాడట ఆ మహానుభావుడు! మద్యం మెదడును మొద్దుబార్చేస్తున్నా సరే, వైద్యం చేసి తీరాల్సిందేనన్న ఆయన తపనకు జోహార్లు! ఇలాంటి వైద్యరత్నాలను పోషిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటానికి కంకణబద్ధమైన ధర్మాసుపత్రులకు పరిపరి దండాలు!!

ప్రభుత్వాసుపత్రులంటే పరార్

‘వైద్యో నారాయణో హరిః’ అన్నమాట ఒకప్పుడు నేల నాలుగు చెరగులా ప్రతిధ్వనించేది. అలాంటి నారాయణులకు నెలవులైన వైద్యాలయాలు, ముఖ్యంగా సర్కారు ఆస్పత్రులంటే చాలు- నేడు ప్రజలకు నిలువెల్లా నిర్వేదం ఆవరించేస్తోంది. నాలుగో కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో 66 శాతం మంది ప్రభుత్వాసుపత్రుల పేరెత్తితేనే ఠారెత్తిపోతున్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానా’కు అని పరిగెత్తి పారిపోతున్నారు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో- సర్కారీ దవాఖానాల మీద సామాన్యుల వైరాగ్యానికి అన్ని కారణాలున్నాయ్‌! అర్ధరాత్రో అపరాత్రో ప్రాణం మీదకొస్తే పైనున్న అశ్వినీదేవతలు దిగొస్తారేమో కాని, ఈ అయ్యవార్లు రారని గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ చెబుతోంది జనసమూహం! ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమంటే పాలకులకు సుతరామూ ఇష్టం ఉండదు కాబట్టి ఆ దవాఖానాల దరికైనా పోవట్లేదు ధర్మప్రభువులు!

కరవులో అధిక మాసమన్నట్లు, ప్రతి పదివేల మందికి సర్కారు తరఫున ఉండేది ఒకే ఒక్క వైద్యుడు! ఆయన ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికైనా తెలిస్తే వాళ్లు అదృష్టవంతులే. సరే, ఆయన అందుబాటులో ఉన్నా ఆస్పత్రుల్లో పడకలుండవు. ప్రతి రెండువేల మందికి ఓ పడక చొప్పున ఉందట ప్రస్తుతం! డెంగీ లాంటివి దాడి చేసినప్పుడైతే ఆ ఒక్క పడక మీద పట్టినంత మంది బహుశా పుష్పక విమానంలో కూడా పట్టి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయువు గట్టిదైతే చాలు... అన్ని రోగాలూ పోతాయనుకుని బతుకుబండిని లాక్కెళ్లేవాడే ‘సగటు భారతీయుడు’ అని ఏ నిఘంటువూ అర్థం చెప్పకపోయినా నమ్మితీరాలి!

ABOUT THE AUTHOR

...view details