వరద నుంచి కాపాడిన జవాన్లకు రాఖీలతో వీడ్కోలు కర్ణాటక చిక్మగళూరు జిల్లాలో మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. వరద విపత్తు నుంచి ప్రాణాలు అడ్డేసి తమను కాపాడిన జవాను సోదరులు ఊరు విడిచి వెళ్తుంటే... కన్నీరుమున్నీరయ్యారు. సొంత అన్న ఇల్లు వదిలి దేశ సేవకు తరలినట్టు భావించి రాఖీ కట్టారు.
సేవలో మిమ్మల్ని మించేదెవరు?
భారీ వర్షాలకు చిక్మగళూరులోని కలెగురి, బలిగే, మలేమనే గ్రామాల్లో వందలాది ఎకరాల పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. రంగంలోకి దిగిన సైనిక బలగాలు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అందుకే సిబ్బంది మొత్తం తమ స్థావరాలకు బయల్దేరారు. జవాన్ల కోసం గ్రామస్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
మా రక్షతో సురక్షితంగా..
యుద్ధ సమయాల్లో క్షణక్షణం గండాలను ఎదుర్కొనే సైనికులు సురక్షితంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. నిజమైన రక్ష వారికే అవసరం. అందుకే మహిళలంతా సైనికుల చేతికి రాఖీ కట్టి పదిలంగా ఉండాలని కోరుకున్నారు. వీర జవానులకు హారతి పట్టి ఆశీర్వదించారు. తల వంచి నమస్కరించారు. చిరునవ్వులతో 'జాగ్రత్త' అంటూ వీడ్కోలు పలికారు.
కుటుంబాలకు దూరంగా ఉంటున్న తమపై ఇంత ప్రేమ, ఆప్యాయత చూపించేసరికి సైనికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.
ఇదీ చూడండి:ఎన్కౌంటర్లో ఎదురుపడ్డ పోలీస్ అన్న-నక్సల్ చెల్లి