తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొరవడిన మేలిమి విద్య.. తక్షణ పరిష్కారం అవసరం - telugu eendau editorial

విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఉన్నతమైన భవిష్యత్తును అందించే విషయంలో దేశం వెనుకంజలో ఉంది. చాలీచాలని నిధులు, బోధన సిబ్బంది కొరతతో విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంపై కేంద్ర వనరుల మంత్రిత్వ శాఖను బోనెక్కిస్తూ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక నిగ్గుతేల్చిన యధార్థమిది. మరి ఈ సమస్యకు పరిష్కారమెక్కడ?

IN INDIA THE EDUCATION QUALITY IS MUST NEED.. BUT GOVERNMENT CANNOT CARING ABOUT THIS ISSUE..
దేశంలో కొరవడిన మేలిమి విద్య... తక్షణ పరిష్కారం అవసరం

By

Published : Mar 14, 2020, 7:24 AM IST

నవ్యాలోచనలకు ఊతమిచ్చి, సృజనశక్తికి రెక్కలు తొడిగి సమర్థ మానవ వనరుల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించాల్సిన విశ్వ విద్యాలయాలు దేశంలో నేడెలా ఉన్నాయి? అరకొర నిధులు, బోధన సిబ్బందికి సంబంధించి భారీయెత్తున ఖాళీలతో అత్యధికం సతమతమవుతున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను బోనెక్కిస్తూ పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక నిగ్గు తేల్చిన యథార్థమిది! ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యారంగం సుమారు రూ.58వేల కోట్లు కోరగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించింది రమారమి రూ.39వేల కోట్లు. విస్తృత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల పరికల్పన, విద్యార్థుల సంఖ్యకు దీటుగా అధ్యాపకుల నియామకాల కోసం ఇవెంతమాత్రం కొరగానివంటున్న స్థాయీసంఘం- ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు పేరుకుపోయాయో సమగ్రంగా వివరాలు క్రోడీకరించింది. ఎన్‌ఐటీలలో 37.7శాతం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు అదే స్థాయిలో, ఐఐటీలలో 29శాతానికి పైగా ఖాళీలు భర్తీ కావాలని, అన్నింటా కలిపి ఆ మొత్తం రమారమి 78వేలుగా లెక్కకట్టింది. అంటే, ఉన్నత విద్యారంగ సంస్థల్లో సగటున మూడోవంతుకుపైగా బోధన సిబ్బంది లేకుండానే పొద్దుపుచ్చుతున్నాయి. ఒక్క ఏడాది కాలంలో ఉన్నత విద్యారంగానికి పది లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన చైనాతో పోలిస్తే దేశీయంగా ఖర్చు సముద్రంలో నీటిబొట్టు అంతేనంటూ నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌ ఆ మధ్య సమస్య మూలాన్ని స్పృశించారు. ఉన్నత విద్యకు కేటాయింపుల్లో 50శాతానికిపైగా ఐఐటీలు, ఐఐఎమ్‌లు, ఎన్‌ఐటీలకు దఖలుపడుతుండగా- తక్కిన 97శాతం విద్యార్థులకు నెలవులైన 865 సంస్థలకు 49శాతం నిధులు విదపడమేమిటంటూ స్థాయీసంఘం- మంత్రిత్వ శాఖ ప్రాథమ్యాల్ని సూటిగా తప్పుపడుతోంది. నిధులలేమికి ఇతరత్రా అంశాలూ ముడివడి దేశీయ ఉన్నత విద్యారంగమే చిన్నబోతోంది!

యోగ్యులైన అభ్యర్థులు కావాలి..

పోనుపోను విస్తరించే అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగ పరిపుష్టీకరణ అత్యంత ఆవశ్యకమని విశ్వవిద్యాలయ సంఘాధ్యక్షులుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఏడు దశాబ్దాల క్రితమే పిలుపిచ్చారు. జాతి నిర్మాణానికి అదెంతటి ప్రాణావసరమో గుర్తెరగని ప్రభుత్వాల అలసత్వం మూలాన వేల సంఖ్యలో అధ్యాపక ఖాళీలు పేరుకుపోయాయిప్పుడు. ఇదంతా మునుపటి పాలక శ్రేణుల్లో ముందుచూపు కొరవడ్డ దుష్పరిణామమే! విదేశీ విద్యార్థుల గమ్యస్థలిగా 26వ స్థానానికి పరిమితమైన ఇండియా ఏటా రెండు లక్షలమందిని ఆకర్షించేలా ప్రత్యేక విద్యామండళ్ల అవతరణను నీతి ఆయోగ్‌ ఇటీవల ప్రతిపాదించింది. ‘భారత్‌లో చదువు’ (స్టడీ ఇన్‌ ఇండియా) పథకాన్ని ప్రాథమికంగా 30 దేశాలకు విస్తరించి వెలుపలి విద్యార్థుల్ని దండిగా ఆకట్టుకోవాలని మోదీ ప్రభుత్వం నిరుడీ రోజుల్లో సంకల్పించింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో వెక్కిరిస్తున్న ఖాళీల భర్తీ, కొత్తగా ప్రతిష్ఠాత్మక సంస్థల నిమిత్తం నియామకాలు- వీటన్నింటికీ తగినన్ని అర్హతలు కలిగిన యోగ్యులైన అభ్యర్థుల్ని వెతికి పట్టుకోవడమే అసలైన సమస్య. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు కలిగినవారు సైతం వివిధ పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘోరంగా చతికిలపడటం విద్యాప్రమాణాల పతనాన్ని ధ్రువీకరిస్తోంది. అటువంటి తప్పాతాలూ సరకునుంచే రేపటి తరాన్ని తీర్చిదిద్దే గురుబ్రహ్మల కోసం అన్వేషణ ఏ తీరుగా సాగేదీ వేరే చెప్పేదేముంది? ఉన్నత విద్యారంగాన బోధన ప్రమాణాల క్షీణతను అరికట్టేందుకంటూ రెండేళ్లక్రితం యూజీసీ (విశ్వవిద్యాలయ నిధుల సంఘం) కొత్త మార్గదర్శకాల ముసాయిదానొకదాన్ని వండివార్చింది. దరిమిలా వరసగా వెలుగు చూసిన దొంగ డాక్టరేట్ల బాగోతాలు నిశ్చేష్టపరచాయి. ఈ తరుణంలో, ఉన్నత ప్రమాణాల సాధనకు లోతైన అవగాహనతో దీర్ఘకాలిక కార్యాచరణ ఒక్కటే శరణ్యం!

విద్యారంగం పునాదికి తూట్లు..

నూతన ఆవిష్కరణలు, మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడులపై ప్రభుత్వాల శ్రద్ధాసక్తులే కార్మిక ఉత్పాదకతను, స్థూల దేశీయోత్పత్తిని నిర్దేశిస్తాయి. తరతరాలూ గర్వంతో ఉప్పొంగేలా జాతి నిర్మాణ క్రతువును ఉరకలెత్తించడంలో విద్యారంగానిది విశేష భూమిక. దేశంలో ఆ రంగం పునాది స్థాయినుంచీ పరమ దుర్బలంగా ఉంది! పదిహేను లక్షల పాఠశాలలతో ప్రాథమిక విద్యారంగం చూపులకు ఏపుగా ఉన్నా, దిగనాసి చదువుల కారణంగా ఇండియా యాభై ఏళ్లు వెనకబడి ఉందని యునెస్కో అధ్యయనపత్రం లోగడే ఈసడించింది. మౌలిక వసతులు మొదలు బోధన సిబ్బంది వరకు అన్నింటా మందభాగ్యం చదువుల స్వారస్యాన్ని, పిల్లల్లో సహజ ప్రతిభాపాటవాలను కుళ్లబొడుస్తోంది. 19 వేల ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో తిష్ఠవేసిన అలసత్వం, యాంత్రిక ధోరణుల్ని సమూలంగా తుడిచిపెడితేనేగాని బోధన మహాయజ్ఞం గాడినపడదు. వేర్వేరు అంచెల్లో గురువులకు కొరత ప్రాతిపదికన 74 దేశాల జాబితాలో భారత్‌ ముందు వరసలో కొనసాగడంవల్ల, చదువుల నాణ్యతకు తూట్లు పడుతున్నాయి. ఈ గడ్డమీద జన్మించి పీహెచ్‌డీలు ఆర్జించినవారిలో లక్షమందికిపైగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తుండగా- వెలుపల ఆచార్య పీఠాలు అధిష్ఠించిన తమ జాతీయుల్ని భారీ జీతభత్యాలపై జన చైనా వెనక్కి రప్పిస్తోంది. ఇక్కడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని గురుపీఠం ఎక్కించి నిరంతర శిక్షణతో రాటుతేల్చే ప్రత్యేక వ్యవస్థ ఎంతైనా అవసరం. నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా లక్షిస్తున్న గతిశీల విజ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణమన్నది అట్టడుగు స్థాయినుంచీ జరగాలి. జిజ్ఞాస, సృజనలే వెన్నుదన్నుగా బడి దశలో నాణ్యమైన చదువులందించే వాతావరణమే ఉన్నత విద్యారంగ దృఢత్వానికి బంగారు బాట. అటువంటి మేలిమి విద్యే జాతి శ్రేయానికి పెట్టని కోట!

ABOUT THE AUTHOR

...view details