తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: అమిత్​షాపై నిలిచి గెలిచేనా..?

అధికార పక్షానికి కంచుకోట. 2 దశాబ్దాలుగా ఓటమే ఎరుగదు. ఈసారి పోటీకి దిగింది స్వయానా పార్టీ అధ్యక్షుడు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేదెలా? సుదీర్ఘ కసరత్తు తర్వాత కాంగ్రెస్​ అధినాయకత్వం ఈ ప్రశ్నకు ఓ సమాధానం కనుగొంది. గుజరాత్​ గాంధీనగర్​ స్థానం నుంచి ఎమ్మెల్యే సీజే చావ్డాను బరిలోకి దింపింది. ఈ వ్యూహం ఫలిస్తుందా? అమిత్​షాకు చావ్డా పోటీ ఇవ్వగలరా?

గాంధీనగర్​లో హోరాహోరి పోరు

By

Published : Apr 17, 2019, 6:22 AM IST

Updated : Apr 17, 2019, 1:01 PM IST

గాంధీనగర్​లో అమిత్​షాపై

గాంధీనగర్.. గుజరాత్​లోని ఈ లోక్​సభ స్థానం భారతీయ జనతా పార్టీ కంచుకోట. అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ సిట్టింగ్​ ఎంపీ. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ లెక్క మారింది. 6 సార్లు గెలిచిన అడ్వాణీ స్థానంలో స్వయంగా భాజపా అధ్యక్షుడు అమిత్​షా బరిలో దిగారు. ఆయన్ను ఎదుర్కొని కాంగ్రెస్ విజేతగా నిలవగలదా అన్నదే ప్రశ్న.​

గాంధీనగర్​లో మొత్తం ఓటర్ల సంఖ్య- 19.21లక్షలు. గుజరాత్​లోని మొత్తం 26 లోక్​సభ సీట్లలో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్నది గాంధీనగర్​లోనే.

1991-2014 మధ్య జరిగిన ఎన్నికల్లో 1996 మినహా అన్నింటిలో అగ్రనేత అడ్వాణీ విజయం సాధించారు. 1996లో మాత్రం ఆయన స్థానంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ పోటీ చేసి గెలిచారు.

గాంధీ నగర్​ పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2017 శాసనసభ ఎన్నికల్లో 5 అర్బన్​ స్థానాలు భాజపావే. పాక్షిక గ్రామీణ నియోజకవర్గాలైన ఉత్తర గాంధీనగర్, కాలాల్​లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అగ్రనేత స్థానంలో అధినేత...

గాంధీనగర్​కు వాజ్​పేయీ, అడ్వాణీ స్థానికేతరులు. అమిత్​షా ఇదే ప్రాంతానికి చెందినవారు. గతంలో షా గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలైన సర్ఖేజ్ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, నారన్​పుర ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందారు. అడ్వాణీ గాంధీనగర్​లో పోటీచేసినప్పుడు అమిత్​షా 2009లో గాంధీనగర్​ లోక్​సభ నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేశారు. ఇవన్నీ అమిత్​కు సానుకూలాంశాలే.

"కాంగ్రెస్ ఇక్కడ పెద్ద విషయమే కాదు. ఇది భాజపా కంచుకోట. మేం అభివృద్ధి, సంక్షేమం రెండూ కల్పిస్తామని ప్రజలకు తెలుసు. ఇప్పటికే మేం చాలా అభివృద్ధి చేసి చూపించాం. ఇక్కడ కాంగ్రెస్​కు​ అభ్యర్థిని ఖరారు చేయకముందే ఓటమి ఖరారైంది. గాంధీనగర్​లో భాజపా అభ్యర్థి ఎవరైనా కచ్చితంగా గెలుస్తారు."

-భరత్​ పాండ్య, భాజపా అధికార ప్రతినిధి

విజయం కోసం అలుపెరగని పోరు...

గాంధీనగర్​లో విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్​. 1996లో వాజ్​పేయీ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేశ్​ ఖన్నాను పోటీకి నిలిపింది. 1998 ఎన్నికల్లో గుజరాత్​ మాజీ డీజీపీ పీకే దత్తాకు టికెట్​ ఇచ్చింది. 1999లో ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి టీఎన్​ శేషన్​ను రంగంలోకి దింపింది. ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు.

అడ్వాణీ స్థానంలో అమిత్​ షా రాకతో కాంగ్రెస్​ కొత్త లెక్కలు వేసుకుంది. గాంధీనగర్​లో బలమైన అభ్యర్థిని నిలబెడితే భాజపా అధ్యక్షుడికి గట్టి పోటీ ఇవ్వవచ్చన్న రాజకీయ విశ్లేషకుల మాట కాంగ్రెస్​ను ఆలోచింపచేసింది. అందుకే అభ్యర్థి ఎంపికపై విస్తృత కసరత్తు చేసింది. పాటీదార్​ ఉద్యమనేత హార్దిక్​ పటేల్​ను రంగంలోకి దింపడంపైనా తర్జనభర్జన పడింది. ఆయన్ను పోటీకి నిలిపితే... 2017 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పడిన పటేళ్ల ఓట్లు ఈసారి తమకు మళ్లుతాయని ఆశపడింది. కానీ సాధ్యపడలేదు. ఓ కేసులో దోషిగా తేలిన హార్దిక్​... పోటీకి అనర్హుడయ్యారు.

పటేల్​ కాదు ఠాకూర్​...

అమిత్​షాను ఎదుర్కొనేందుకు ఉత్తర గాంధీనగర్​ ఎమ్మెల్యే సీజే చావ్డాను రంగంలోకి దింపింది కాంగ్రెస్​. ఆయన స్థానికుడు, రెండు సార్లు శాసనసభ్యుడు, ఠాకూర్​ వర్గం నేత. ఆ సామాజిక వర్గం మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్​కే.

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన అమిత్​షాను చావ్డా ఎదుర్కోగలరా అన్నదే అసలు ప్రశ్న.

"ఈ పోటీ చావ్డాకు, అమిత్​షాకు మధ్య అనొద్దు. ఈ ఎన్నికలు కాంగ్రెస్​, భాజపా మధ్య పోటీ. అమిత్​ షా భాజపా అధ్యక్షుడిగా ఉండి సురక్షిత స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? గట్టి సవాలు ఎదురయ్యే చోట నిలబడాల్సింది కదా. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్య నేతలు గాంధీనగర్​లో చేసిన మెగా ర్యాలీలో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. లక్షలాది మంది హాజరయ్యారు. దాన్ని బట్టే తెలుస్తోంది భాజపాకు గుజరాత్​లో విజయం అనుకున్నంత సులువుగా లేదని. భాజపాకు మేం గట్టి పోటీనిస్తాం."

-సీజే చావ్డా, గాంధీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి

అడ్వాణీ విజయపరంపరను అమిత్​షా కొనసాగిస్తారా? సీజే చావ్డా సరికొత్త చరిత్ర లిఖిస్తారా అనేది మే 23న తేలనుంది.

ఇదీ చూడండి:భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

Last Updated : Apr 17, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details