ఆరోపణలు... విమర్శలు... ఎత్తులు.. పై ఎత్తులు.. వాగ్దానాలు... బిహార్ ఎన్నికల రాజకీయం సాగుతున్న తీరిది. ఈ వాడీవేడి సమరంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. ఓవైపు మాటల తూటాలు పేలుస్తూనే.. మరోవైపు పాటలతో ప్రజల మనస్సును దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు పోటీపడి మరీ ఎన్నికల గీతాలతో అలరిస్తున్నాయి. ఈ పరిణామాలు కొత్త 'పాటల' యుద్ధానికి దారితీశాయి.
మోదీ మంత్రంతో భాజపా...
ఈ 'పాటల యుద్ధం'లో భాజపా తనదైన శైలిలో దూసుకుపోతోంది. పార్టీలోని కళాకారులను రంగంలోకి దింపుతోంది. ఎంపీ, భోజ్‌పురి గాయకుడు మనోజ్ తివారీ చేత పాటలు పాడించి ప్రజల్లోకి వెళుతోంది. 'ప్రభుత్వంపై మరోమారు నమ్మకం ఉంచండి' అంటూ సాగుతున్న పాటలు ఆకట్టుకుంటున్నాయి.
'సునా హో బిహార్ కె భయ్యా' అని సాగే పాటను ఎన్నికల పాటగా విడుదల చేసింది భాజపా. ఇది ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయీ నటించిన గాంగ్స్ ఆఫ్ వస్సీపుర్ సినిమా పాటను గుర్తుచేస్తుంది. అయితే ఈ ఒరిజినల్ పాటను కంపోజ్ చేసిన గాయని స్నేహా ఖాన్వాల్కర్.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తరఫున ప్రచారం చేయడం గమనార్హం.
8 నిమిషాల పాటు సాగే ఈ కొత్త పాటలో.. నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మనోజ్ తివారీ. ఎన్డీఏ పాలనలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని గుర్తుచేశారు.
ఇలానే మరికొన్ని పాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కమలదళం.
ఇదీ చూడండి:-నితీశ్ ప్రచార సభలో 'లాలూ జిందాబాద్'..!