కరోనా నిర్బంధ కేంద్రం నుంచి బాధితులు పారిపోకుండా చెక్పోస్టును ఏర్పాటు చేశారు అసోంలోని బోకో ప్రాంత వాసులు. గ్రామస్థులే షిఫ్టుల వారీగా స్వచ్ఛందంగా కాపలా కాస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోకో ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ కళాశాలను నిర్బంధ కేంద్రంగా మార్చారు అధికారులు. అయితే కొంతమంది బాధితులు కేంద్రం నుంచి పారిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సకాబాహా, జరపారా, మౌమన్ గ్రామస్థులు ఎవరూ పారిపోకుండా కాపలా కాసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇందుకోసం చెక్పోస్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు.
"కరోనా నిర్బంధ కేంద్రం నుంచి ఎవరు పారిపోకుండా మేము కాపలాగా ఉంటున్నాం. బాధితులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే వైరస్ను వ్యాప్తి చేస్తారు. అప్పుడు మహమ్మారి అనేక మంది జీవితాలను అపాయంలోకి నెట్టి వేస్తుంది. మూడు షిఫ్టుల వారీగా రోజూ 8 గంటలపాటు కాపలా కాస్తున్నాం. ఒక్కొక్క షిఫ్టుకు ఆరుగురం ఉంటున్నాం."