మహిళా సాధికారత, భద్రత దిశగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలను డ్రైవర్లుగా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కౌశాంబీలో శుక్రవారం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని ఘాజియాబాద్ రూట్లలో నియమించనున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా మహిళలను నియమించటం ఇదే మొదటిసారి అని ఘాజియాబాద్ డిపో మేనేజర్ అఖిలేశ్ సింగ్ తెలిపారు.
"నిర్భయ నిధి ద్వారా కొనుగోలు చేసిన బస్సుల్లో మహిళలే డ్రైవర్లుగా ఉంటారు. మహిళా చోదకులను నియమించటం ఇదే తొలిసారి. వీరిని చూసి మహిళా ప్రయాణికులకు భద్రతపై భరోసా ఉంటుంది. వీరి స్ఫూర్తితో మరికొంత మంది డ్రైవింగ్‌ను తమ వృత్తిగా ఎంచుకునే అవకాశం ఉంటుంది."