తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2019, 1:51 PM IST

ETV Bharat / bharat

భారత్​ భేరి: మాజీ గవర్నర్ X మాజీ దౌత్యవేత్త

99వేల 998...! శశి థరూర్​కు 2009 లోక్​సభ ఎన్నికల్లో తిరువనంతపురంలో వచ్చిన ఆధిక్యం. 2014లో ఆ సంఖ్య 15వేలు. మరి 2019లో...? ఆధిక్యం సంగతి సరే... అసలు విజేత ఎవరు? నియోజకవర్గమంతా ఇదే చర్చ. మూడు ప్రధాన కూటముల అభ్యర్థులు బలమైన వారే కావడం ఇందుకు కారణం.

తిరువనంతపురంలో త్రిముఖ పోటీ

తిరువనంతపురంలో త్రిముఖ పోటీ
ఎవరికీ కంచుకోట కాదు. అభ్యర్థుల్లో ఎవరూ తక్కువ వారు కాదు. ముగ్గురూ ముగ్గురే. అందుకే కేరళ రాజధాని తిరువనంతపురం లోక్​సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్రిముఖ పోరులో విజేతగా నిలిచి తీరడం... మూడు ప్రధాన కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ప్రధాన పోటీదారులు:

  • శశిథరూర్​- కాంగ్రెస్​ నేతృత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి
  • కుమ్మనం రాజశేఖరన్​- భాజపా సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి
  • సి. దివాకరన్​- సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి

తిరువనంతపురం ఓటర్లు ఏ ఒక్క పార్టీకో ఏకపక్షంగా మద్దతిచ్చిన సందర్భాలు లేవు. కాంగ్రెస్​కు, ఎల్​డీఎఫ్​లో రెండో పెద్ద భాగస్వామ్యపక్షమైన సీపీఐకి గతంలో అవకాశం ఇచ్చారు. కాబట్టి... కంచుకోట అనే మాటలు చెప్పి, సామాజిక సమీకరణాలు లెక్కలేసుకుని విజయంపై ధీమాగా ఉండే పరిస్థితి లేదు.

యువతపైనే నమ్మకం

తిరువనంతపురం స్థానాన్ని నిలబెట్టుకుంటే చాలని భావిస్తోంది కాంగ్రెస్​. 2009లో ఆ పార్టీ తరఫున ఐరాస మాజీ దౌత్యవేత్త శశిథరూర్​ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లోనూ విజయం సాధించినా... ఆధిక్యం 15వేలకు పడిపోయింది. ఆ ఎన్నికల్లో భాజపా సీనియర్​ నేత రాజగోపాల్​ గట్టి పోటీ ఇచ్చారు.

ఇవీచూడండి:

ఈసారి మాత్రం భారీ ఆధిక్యంతో హ్యాట్రిక్​ విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు శశి థరూర్​.

ఈ విశ్వాసం వెనుక అనేక కారణాలు:

  • అంతర్జాతీయ స్థాయిలో థరూర్​కు ఉన్న పేరుప్రఖ్యాతలు
  • పదేళ్లుగా నియోజకవర్గంలో చురుకుగా పనిచేయడం
  • దిగ్గజ ఐటీ సంస్థలను తిరువనంతపురం తీసుకొచ్చేందుకు థరూర్​ చేసిన కృషి
  • జాతీయ రహదారుల అభివృద్ధికి ఉన్న అడ్డంకులు తొలిగించేందుకు కృషి
  • యువ ఓటర్లు థరూర్​కే మద్దతిస్తారని ఆశ

గవర్నర్​ నుంచి ఎంపీ అభ్యర్థిగా..

2014 ఎన్నికల్లో తిరువనంతపురంలో ఓట్ల శాతం పరంగా రెండో స్థానంలో నిలిచింది భాజపా. శబరిమల వివాదం, మోదీ ప్రజాకర్షణ వంటి అంశాలు కలిసొచ్చి... ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాగా ఉంది కమలదళం.

కుమ్మనం రాజశేఖరన్​ వ్యక్తిత్వంపైనా భారీ ఆశలు పెట్టుకుంది భాజపా. మొన్నటి వరకు రాజశేఖరన్​ మిజోరం గవర్నర్​. ఆ పదవికి రాజీనామా చేసి లోక్​సభ ఎన్నికల బరిలో దిగారు. తిరువనంతపురం ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించగల సామాజిక వర్గాల నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. సామాన్య జీవితం గడుపుతూ అందరితో కలిసిపోయే రాజశేఖరన్​ను ఓటర్లు ఆదరిస్తారని భాజపా నమ్మకం.

ఇవీ చూడండి:

సామాజిక వర్గాల పరంగా... నాయర్​ ఓట్లు తమకే పడతాయని లెక్కలేసుకుంటోంది భాజపా. సుప్రీంకోర్టు శబరిమల తీర్పు నేపథ్యంలో భక్తుల హక్కులు, మనోభావాలు కాపాడేవారికే తమ మద్దతని నాయర్​ సేవా సంఘం ఇప్పటికే ప్రకటించింది.

స్థానిక నేతగా..

2014లో మూడో స్థానానికే పరిమితమైంది ఎల్​డీఎఫ్​. ఈసారి ఎలాగైనా తిరువనంతపురంలో గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. నెడుమంగడ్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే, కార్మిక నేతగా పేరున్న సీపీఐ నేత దివాకరన్​ను బరిలోకి దింపింది.

నియోజకవర్గంలో దివాకరణ్ అందరికీ తెలిసిన ముఖమే. ప్రజల అవసరాలను థరూర్ తీర్చలేకపోయారని అయన ఆరోపిస్తున్నారు. శబరిమల వివాదానికి కారణమైనందుకు భాజపాను ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెబుతున్నారాయన.

"పినరయి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆగస్టు వరదల సమయంలో ముఖ్యమంత్రి సమర్థంగా పని చేశారు. శబరిమల వివాదంలో భాజపా ప్రచారాన్ని ప్రజలు తిరస్కరిస్తారు. మోదీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మా విజయానికి ఉపకరిస్తుంది. రాష్ట్ర రాజధానిలో పూర్వ వైభవం సాధిస్తాం."
-దివాకరన్, ఎల్డీఎఫ్ అభ్యర్థి

తిరువనంతపురం త్రిముఖ పోరులో విజయం ఎవరిదన్నది మే 23నే తేలనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details