పోంజి కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఐఎంఏ సంస్థలకు సంబంధించిన రూ.209 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఇందులో రూ.197కోట్లు విలువ చేసే స్థిరాస్తులు, రూ.12కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రూ.40వేల కోట్ల పెట్టుబడులు నష్టపోతామనే భయంతోనే ఐఎంఏ సంస్థల మేనేజింగ్ డెరెక్టర్ మన్సూర్ ఖాన్ అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఇటీవలే ఈడీ ఈయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
పోంజి స్కీమ్ పేరుతో ఐఎంఏ సంస్థ ప్రజలను మోసం చేసి మనీలాండరింగ్‌కు పాల్పడి స్థిరాస్తులు, చరాస్థులను కూడబెట్టినట్లు ఈడీ తెలిపింది. ప్రతినెల 2.5నుంచి 3శాతం వరకు లాభాలొస్తాయని ఇన్వెస్టర్లకు ఖాన్ చెప్పినట్లు పేర్గొంది. వీరిలో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.
పెట్టుబడులు మొత్తం నష్టపోయినట్లు ఖాన్ విడుదల చేసిన వీడియోతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఖాన్‌కు గతంలో పలుమార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ముందు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. ఆయన దేశం వీడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇంటర్‌పోల్ అరెస్టు వారెంటు జారీ చేసి ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఈడీ పేర్కొంది.