కర్ణాటకలో సంకీర్ణ సర్కారు గురువారం బలపరీక్షను ఎదుర్కోబోతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రోషన్ బేగ్ను ఐఎమ్ఏ జ్యూవెలరీ పోంజీ కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.
ఎమ్మెల్యే రోషన్ బేగ్ అరెస్ట్ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న రోషన్ బేగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది.
ఈ విషయంపై సీఎం కుమారస్వామి స్పందించారు. యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్, భాజపా ఎమ్మెల్యే యోగేశ్వర్ ఆ సమయంలో అక్కడ ఉన్నారని ఆరోపించారు. కేసులో ఉన్న వ్యక్తిని ముంబయి తరలించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కుమారస్వామి.
కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సహాయం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా ప్రయత్నిస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని కుమారస్వామి ఆరోపించారు.
తిప్పికొట్టిన భాజపా....
కుమారస్వామి ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే రాష్ట్ర యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని విమర్శించింది. కేసు విషయమై సిట్ ముందు హాజరయ్యేందుకు రోషన్ బేగ్కు ఈ నెల19 వరకూ గడువుందని భాజపా పేర్కొంది. యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి అక్కడున్నారన్న ఆరోపణలను ఖండించింది.
పార్టీ క్రమశిక్షణావళిని ఉల్లంఘిస్తున్నారంటూ శివాజీనగర్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ను కాంగ్రెస్ పార్టీ గతంలో సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేల బృందంతో రోషన్ బేగ్ చేరారు.