రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డబ్బు ఎరచూపినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
సచిన్ పైలట్ రాజసభ ఎన్నికల్లో తన అనుకూల వర్గానికి ఓటు వేయమని చెబుతూ... రూ.35 కోట్లు తనకు ఇచ్చేందుకు ప్రయత్నించారని రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ తీవ్రంగా స్పందించారు.
"నాపై చేసిన నిరాధార ఆరోపణల పట్ల చాలా బాధపడ్డాను. అయితే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. రాజస్థాన్ కాంగ్రెస్ అధినాయకత్వానికి వ్యతిరేకంగా నేను చట్టబద్ధమైన ఆందోళన చేశాను. అందువల్లనే వారు నా పరువును, విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇది ప్రధాన సమస్యను పక్కదారి పట్టించడానికి సీఎం గహ్లోత్ వర్గం చేస్తున్న ప్రయత్నం."