తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎక్స్​రేతో 5 సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్​వేర్! - Covid-19 latest updates

ఐదు సెకన్లలో కరోనాను కనిపెట్టే సాఫ్ట్​వేర్​ను రూపొందించినట్లు వెల్లడించారు రూర్కీ ఐఐటీ ప్రొఫెసర్ కమల్​ జైన్. ఎక్స్​రే విధానాన్ని ఉపయోగించి తయారుచేసిన ఈ విధానం ద్వారా పరీక్ష వ్యయాన్ని తగ్గించడమే కాక.. టెస్టులు చేసే వైద్య సిబ్బందికి కరోనా ముప్పు​ తగ్గుతుందని వివరించారు. తన ఆవిష్కరణకు పేటెంట్ కావాలని భారతీయ వైద్య పరిశోధనా మండలికి దరఖాస్తు చేశారు.

covid test in five seconds
ఎక్స్​రే ద్వారా ఐదు సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్​వేర్!

By

Published : Apr 24, 2020, 3:44 PM IST

ప్రస్తుతం కరోనా ఫలితాలు రావాలంటే రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో చేసిన పరీక్షల ఫలితాలపై విశ్వసనీయత కొరవడింది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధరణ కోసం కొత్త పద్ధతి కనిపెట్టారు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ కమల్ జైన్. ఎక్స్​రే ద్వారా ఐదు సెకన్లలో కరోనా అనుమానితుడిని గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు. తన ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వాలని కోరుతూ భారతీయ వైద్య పరిశోధనా మండలికి దరఖాస్తు చేశారు.

తన ఆవిష్కరణ వల్ల పరీక్షకు అయ్యే ఖర్చుతోపాటు వైద్య సిబ్బందికి కరోనా సోకే ముప్పు తగ్గుతుందని వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ జైన్.

కృత్రిమ మేధస్సు ద్వారా..

ఈ పరిశోధన కోసం కృత్రిమ మేధస్సు సాయంతో డేటాబేస్​ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు పరిశోధకుడు. ఇందుకోసం కరోనా బాధితులు, నిమోనియా, టీబీ రోగులకు సంబంధించిన 60 వేల ఎక్స్​రేలను విశ్లేషించినట్లు చెప్పారు. మూడు వ్యాధుల్లో ఛాతిలో రక్తం పోగయ్యే విధానాన్ని అధ్యయనం చేసినట్లు వివరించారు. ఇందుకోసం అమెరికాకు చెందిన ఎన్​ఐహెచ్ ఎక్స్​రే డేటాబేస్​నూ విశ్లేషించానని చెప్పారు.

"నేను అభివృద్ధి చేసిన విధానంలో వైద్యులు అనుమానితుడి ఎక్స్​రేను సాఫ్ట్​వేర్​లో అప్​లోడ్ చేయవలసి ఉంటుంది. సాఫ్ట్​వేర్ అనుమానితుడికి నిమోనియా ఉందా అనే అంశాన్ని విశ్లేషించడమే కాదు.. అది కరోనా వల్ల వచ్చిందా లేక మరో బ్యాక్టీరియా కారణమా అనే అంశాన్ని తెలియజేస్తుంది. ఇన్​ఫెక్షన్ తీవ్రతను కూడా వెల్లడిస్తుంది. అంతా ఐదు సెకన్లలో జరిగిపోతుంది."

-కమల్ జైన్, సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, ఐఐటీ రూర్కీ

ఈ సాఫ్ట్​వేర్​ ద్వారా కరోనా లక్షణాలున్న వారిని ప్రాథమికంగా నిర్ధరించవచ్చని వెల్లడించారు ప్రొఫెసర్ జైన్. అనంతరం వారికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించవచ్చన్నారు.

కరోనా వల్ల వచ్చే నిమోనియాలో మిగతా బ్యాక్టీరియాలతో పోలిస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కొవిడ్-19తో ఊపిరితిత్తులు పూర్తిగా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. అమెరికాలోని అమెజాన్ విశ్వవిద్యాలయంలోనూ ఈ తరహా పరీక్షలు జరిగాయని.. అయితే ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదని చెప్పారు జైన్.

ఇదీ చూడండి:భారత్​లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details