బయోమిమిక్రీ అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మద్రాస్' (ఐఐటీ-ఎం) సన్నాహాలు చేస్తోంది. ఫుల్ సెమిస్టర్ పద్ధతిలో ఈ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు ఐఐటీ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బయోమిమిక్రీ కోర్సు కోటానుకోట్ల జీవరాశుల ప్రత్యేకతలను గ్రహించి.. అవి మానవాళికి ఉపయోగపడేలా పరిశోధనలు చేసేందుకు తోడ్పడుతుంది. ఉదాహరణకు.. తామర ఆకుకు మురికిని తిప్పికొట్టే శక్తి ఉంటుంది. నీటి బిందువులతో పాటు వ్యర్థ కణాలను తనపై వాలనీయకుండా చేస్తుంది. అలాంటి శక్తి మన దుస్తులకు వినియోగిస్తే.. మన యూనిఫాంలు తళతళామెరిసిపోతాయి కదా..! ఈ బయోమిమిక్రీ కోర్సులో సృష్టిలోని జీవులు వినియోగిస్తున్న టెక్నిక్‌ను గమనించి, అందులోనుంచి అద్భుతమైన ఆవిష్కరణలు చేయొచ్చు.
బుల్లెట్ కు ప్రేరణ ఈ బుల్లి పక్షి గతంలోనూ ప్రకృతి మనకు ఎన్నో రకాల ఆవిష్కరణలకు తోడ్పడింది. మచ్చుకకు... జపాన్ తొలిసారి షింకాన్సెన్ బుల్లెట్ రైలు సృష్టించడానికి.. కింగ్ ఫిషర్ పక్షి ముక్కు ప్రేరణ కలిగించింది. విద్యుత్తు ఉత్పత్తికి వినియోగిస్తున్న విండ్ టర్బైన్లు హంప్‌బ్యాక్ తిమింగలాల రెక్కలను చూసే డిజైన్ చేశారు. ఇలా బోలెడన్ని సాంకేతికతలకు ప్రేరణ ప్రకృతి నుంచే కలిగింది.
అందుకే, ఈ కోర్సు బయాలజీ, ఇంజినీరింగ్ కలయికలా ఉంటుందని.. చదవాలనుకునే వారు ఆ విభాగాలకు చెందినవారే కావాల్సిన అవసరం లేదంటున్నారు నిర్వాహకులు. కుతూహలం ఉంటే చాలంటున్నార. కోర్సులో చేరాలనుకునే వాళ్లు 91766 12393 నంబరులో, లేదా shiva@thinkpaperclip.com ఈమెయిల్ ఐడీలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి: తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!