తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇంధనం

వ్యవసాయ వ్యర్థాలు, ప్లాస్టిక్​ను ఉపయోగించి బయో ఇంధనాన్ని వెలికి తీసే ప్రక్రియను అభివృద్ధి చేశారు ఐఐటీ మద్రాస్​ పరిశోధకులు. సాధారణ పైరొలైసిస్ విధానానికి మరింత మెరుగులు దిద్ది నాణ్యమైన ఇంధనాన్ని తయారు చేశారు. మైక్రోవేవ్​ను ఉపయోగించి బయోమాస్, ప్లాస్టిక్​లతో కో-పైరొలైసిస్ ప్రక్రియ చేపట్టారు.

IIT Madras Research Team produces High Energy Bio-oil from Agricultural and Plastic Waste
మైక్రోవేవ్, ప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాలతో బయో ఇంధనం

By

Published : Jun 15, 2020, 8:25 PM IST

వ్యవసాయ వ్యర్థాల నుంచి అధిక శక్తిగల బయో ఇంధనాన్ని వెలికితీసే మైక్రోవేవ్ పద్ధతిని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గడ్డి, చెరకు పిప్పి సహా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం తయారీ చేసే ప్రక్రియను రూపొందించారు.

కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఆర్​ విను నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విధానాన్ని ఆవిష్కరించింది. వీరి పరిశోధన సారాంశం ప్రఖ్యాత 'బయో రిసోర్స్ టెక్నాలజీ', 'ఫ్యూయెల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ' జర్నల్​లలో ప్రచురితమైంది.

"పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా రసాయనాలు, ఇంధనం ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగిన పునరుత్పాదక కర్బన వనరు బయోమాస్ మాత్రమే. చెరకు పిప్పి, కలప, గడ్డి వంటి వ్యవసాయ ఉత్పత్తులు బయో ఇంధనం ఉత్పత్తి చేయడానికి జీవపదార్థాలుగా ఉపయోగపడతాయి."

-డా.ఆర్ విను, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్

సాధారణంగా పైరొలైసిస్(అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి కుళ్లిపోయేలా చేయడం) అనే విధానం ద్వారా బయోమాస్​ను ఇంధనంగా మార్చుతారు. అయితే.. శిలాజ ఇంధనంతో పోలిస్తే ఇందులో అధిక స్థాయిలో ఆక్సిజనేట్లు ఉంటాయి. ఈ ఆక్సిజనేట్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేయడమే కాకుండా అధిక లవణం, తుప్పును ఉత్పన్నం చేస్తాయి. బయో ఆయిల్​ను శిలాజ ఇంధనంతో పోలిస్తే మరింత మెరుగ్గా మార్చాలంటే అందులో ఆక్సిజనేట్ల స్థాయిని తగ్గించి, హైడ్రోజన్ స్థాయిని పెంచాల్సి ఉంటుంది.

హైడ్రోజన్​ తగ్గించేందుకు

ఇందుకోసం హైడ్రోజన్ ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్​ను బయోమాస్​ ఉత్పత్తిలో వినియోగిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రొఫెసర్ విను వెల్లడించారు. ఈ ప్లాస్టిక్​.. బయో ఆయిల్​కు హైడ్రోజన్​ను సరఫరా చేసి ఆక్సిజనేట్లను తగ్గించడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

బయోమాస్​, ప్లాస్టిక్​ను కలిపి పైరొలైసిస్ చేయడం ద్వారా ఇంధన కేలొరిఫిక్ విలువ పెరగడమే కాకుండా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా ఈ ప్రక్రియ సామర్థ్యం మెరుగుపడి ఇంధన దిగుబడి పెరుగుతుంది. ప్లాస్టిక్ లేకుండా కేవలం బయోమాస్​ ద్వారా తయారు చేసే ఇంధనంతో పోలిస్తే ఈ ఇంధనం అధిక శక్తిని విడుదల చేస్తుంది.

మైక్రోవేవ్​ ద్వారా

ఈ మేరకు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి.. మైక్రోవేవ్ ద్వారా బయోమాస్, ప్లాస్టిక్​లతో కో-పైరొలైసిస్ ప్రక్రియ చేపట్టారు. ​వ్యవసాయ వ్యర్థాలతో పాలిప్రాపలీన్, పాలిస్టరీన్ ప్లాస్టిక్​ను కలిపి మైక్రోవేవ్​ ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించారు.

మరోవైపు బయో ఆయిల్ నాణ్యతను మరింత పెంచడానికి జియోలైట్ అనే ఉత్ప్రేరకాన్ని ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఉత్ప్రేరకం ద్వారా బయో-ఆయిల్ మంచి లక్షణాలు కనబర్చినట్లు పేర్కొన్నారు. వనరుల పునరుద్ధరణ కోసం 'మైక్రోవేవ్ పైరొలైసిస్' ప్రక్రియ ఓ శక్తిమంతమైన విధానమని ప్రొఫెసర్ విను అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:టీఎంసీలో అసమ్మతి సెగ- భాజపాకు లాభించేనా?

ABOUT THE AUTHOR

...view details