ప్రతిరోజు కళాశాలకు వెళ్లకుండానే డిగ్రీ సర్టిఫికేట్ పొందేందుకు మార్గం సుగమం చేసింది ఐఐటీ మద్రాస్. ప్రపంచంలో తొలిసారి ఆన్లైన్ డిగ్రీ, డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్సెస్లో ఈ అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఈ కోర్సుకు ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారు? వంటి వివరాలు చూద్దాం.
ఎలా అప్లై చేసుకోవాలి..?
డిప్లమోలో చేరాలనుకుంటే విద్యార్థి 10వ తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులను కచ్చితంగా చదవాలి. వాటితో పాటు ఇంటర్ పూర్తి చేయాలి. డిగ్రీలో చేరేందుకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లు, డిగ్రీ చదివిన వాళ్లు, మధ్యలోనే డిగ్రీ ఆపేసిన వాళ్లు అర్హులు. దీనికి ఓ అర్హత పరీక్ష ఉంటుంది. దరఖాస్తు రుసుం 3వేల రూపాయలు. ఇందులో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.
ఆన్లైన్ కోర్సులో..
ఈ ఆన్లైన్ కోర్సు ప్రోగ్రామ్లో మూడు లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్ లెవల్, డిప్లమో, డిగ్రీ. ఇందులో ఎప్పుడైనా విద్యార్థి నిష్క్రమించొచ్చు. లేదంటే మూడింటినీ పూర్తి చేయొచ్చు. ఇందులో మొత్తం 31 కోర్సులు ఉంటాయి. వాటిని మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ కోర్సులు, ఎసైన్మెంట్లు, క్విజ్లు, పరీక్షలు వర్చువల్గా జరుగుతాయి. వాటికి 116 క్రెడిట్లు ఇస్తారు.
కోర్సులను ఎంపికచేసుకున్న విద్యార్థులకు రెండు ఎంట్రీ ఆప్షన్లు ఉంటాయి.