ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ), మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాయంతోఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి సరికొత్త అల్గారిథమ్‌లను అభివృద్ధి చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)- మద్రాస్ పరిశోధకులు. తమ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ 'ఏఐసాఫ్ట్' కోసం ఓ అంకుర పరిశ్రమను ప్రారంభించి.. థర్మల్ మేనేజ్మెంట్, సెమీకండక్టర్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ కూలింగ్ అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్లను దశాబ్ద కాలంగా వినియోగిస్తున్నా.. అవి కేవలం సిగ్నల్ ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నైజేషన్, ఇమేజ్ రీకన్స్ట్రక్షన్, ప్రెడిక్షన్కే పరిమతమయ్యాయి. సమస్య పరిష్కారానికి ఈ తరహా అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు చాలా తక్కువ ప్రయత్నాలు జరిగాయి.
ఐఐటీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు డా. విశాల్ నందిగానా నేతృత్వంలోని పరిశోధకుల బృందం... కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను సృష్టించింది. మనుషులకు అంతుచిక్కని సమస్యలకూ ఇవి పరిష్కారాన్ని అందిస్తాయి.
ఇదొక సరికొత్త ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధక బృందాల దృష్టి దీనిపై పడింది. సమస్యల పరిష్కారానికి ఈ పరిశోధక బృందాలు.. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్(సీఎన్ఎన్), సీ-జీఏఎన్(కండీషనల్ జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్)లను వినియోగిస్తున్నాయి.