కరోనా మహమ్మారి నేపథ్యంలో కళాశాలలు, పాఠశాలలు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. అంతా ఆన్‌లైన్‌లో పాఠాలు. ఇలాంటి సమయంలో మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం గతవారం జరిగింది. మామూలు పరిస్థితుల్లో అయితే అధ్యాపకులు, అధికారులు, పట్టభద్రులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కార్యక్రమం సందడిగా జరిగేది. ఈ సారి వర్చువల్‌గా నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. దాదాపు 2,346 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని వినియోగించడం మరొక ఎత్తు. మిక్స్‌డ్ రియాల్టీ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన వీడియో టీజర్ నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది.
ఐఐటీ మద్రాస్ 'రియాల్టీ' షో.. వీడియో వైరల్ - iit madras convocation 2020
కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసి వేశారు. ఆ కారణంగా వివిధ విద్యా సంస్థల్లో జరగాల్సిన కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. కానీ మద్రాస్ ఐఐటీ మాత్రం పట్టభద్రలుకు ధ్రువపత్రాలు అందించే స్నాతకోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
వీడియోలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి మాట్లాడుతూ.. "1964 నుంచి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రతి సారి భారత రాష్ట్రపతి పతకం ఎవరికి వస్తుందని తెలుసుకునేందుకు మనమంతా ఆస్తకిగా ఎదురు చూసేవాళ్లం. అయితే ఈ సారి అవార్డు విజేత ఇక్కడ (స్టేజీ మీద) లేకపోవడం చాలా నిరాశపరిచింది. పతక విజేత తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారు. చూద్దాం ఏమవుతుందో" అని చెప్పారు. భారత రాష్ట్రపతి బంగారు పతకంతో పాటు మూడు బహుమతులను సాధించిన విద్యార్థి రజత్ వడిరాజ్ ద్వారకానాథ్ ఒక్కసారిగా స్నాతకోత్సవం వేదికపై ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు. మెడల్‌ను స్వీకరించడంతోపాటు తన అనుభవాలను పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.