టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో తొలి వంద స్థానాల్లో భారత్‌కు చెందిన 8 సంస్థలు నిలిచాయి. 500లోపు ర్యాంకులను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు విద్యాసంస్థలు దక్కించుకున్నాయి. భారత్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్ ఐఐటీ ఆ గౌరవాన్ని దక్కించుకుంది. ఐఐఎస్ఈకి ఆసియాలో 36 ర్యాంకు దక్కింది. ఈసారి దిల్లీ, బాంబే ఐఐటీలను తోసిరాజని పంజాబ్‌లోని రోపార్, పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఐఐటీలు ముందు వరుసలో నిలిచాయి. 2016 తర్వాత ఇన్ని విద్యాసంస్థలు ఆసియాలో వందలోపు ర్యాంకుల్లో నిలవడం ఇదే ప్రథమం. దేశంలో పోటీ పెరగడంతో ఈసారి పంజాబ్‌లోని ఐఐటీ రోపార్ టాప్‌లోకి వచ్చింది. 2019తో పోలిస్తే ఐఐటీ ఖరగ్‌పుర్, ఐఐటీ దిల్లీలు మాత్రమే తమ ర్యాంకును మెరుగుపరుచుకున్నాయి.
నేచర్ ఇండెక్స్ ర్యాంకుల్లో.. హెచ్‌సీయూకు ప్రథమస్థానం
నేచర్ ఇండెక్స్ 2019-20 ర్యాంకుల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సత్తా చాటింది. విశ్వవిద్యాలయాల పరంగా చూస్తే పరిశోధనల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. మొత్తంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలతో పోల్చుకుంటే 15వ స్థానం దక్కించుకుంది. గతేడాది 17వ ర్యాంకు సాధించగా.. ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్యకాలానికి పరిశోధనాఫలాల ఆధారంగా నేచర్ ఇండెక్స్ ర్యాంకులు జారీ చేసింది. లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్సెస్‌లో జరిగిన పరిశోధనల ప్రాతిపదికగా ర్యాంకు దక్కింది. లైఫ్‌సైన్సెస్ విభాగంలో 6వ ర్యాంకు, కెమిస్ట్రీలో 12 ర్యాంకు, ఫిజికల్ సైన్సెస్‌లో 13వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వీసీ ప్రొ.పొదిలె అప్పారావు మాట్లాడుతూ.. ఆచార్యులు, విద్యార్థుల కృషికి ప్రతిఫలంగా ర్యాంకు దక్కినట్లు తెలిపారు. నేచర్ ఇండెక్స్‌లో మొదటిర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.
ఇదీ చదవండి:కరోనాతో మున్ముందు మరిన్ని సవాళ్లు: జస్టిస్ రమణ