కర్ణాటకలో 14 ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వ మనుగడపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అవకాశం వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనని భాజపా ప్రకటనతో ఈ రెండు పార్టీల్లో మరింత గుబులు మొదలయింది. భాజపా ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సమన్వయ కమిటీని నియమించాయి.
ప్రభుత్వాన్ని కాపాడునే దిశలో కమిటీ సూచించిన అంశాలను పాటిస్తామని జేడీఎస్ సీనియర్ నేత జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు.
"సమన్వయ కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయాలని కమిటీ భావిస్తే అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కేబినెట్ మంత్రులుగా ఉన్న సీనియర్లు రాజీనామా చేస్తారని ఆ పార్టీ తెలిపింది."
-జీటీ దేవెగౌడ, జేడీఎస్ సీనియర్ నేత
బెంగళూరుకు కుమారస్వామి
ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించి బెంగళూరు చేరుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు.