దేశ సరిహద్దుల రక్షణ విషయంలో కేంద్రప్రభుత్వం ఏమాత్రం రాజీపడరాదని ఉద్ఘాటించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత్-చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు.
లద్దాఖ్‌లో వీరమణం పొందిన జవాన్ల గౌరవార్థం కాంగ్రెస్ చేపట్టిన "స్పీక్ అప్ ఫర్ జవాన్స్" కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు సోనియా. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ అంటున్నారని... అదే నిజమైతే 20 మంది సైనికులు వీరమరణం ఎలా పొందారని ప్రశ్నించారు.
అసలు చొరబాటు జరగలేదని మోదీ అంటున్నారని.. కానీ ఉపగ్రహ చిత్రాలు చూసిన నిపుణులు మాత్రం భారత సరిహద్దులో చైనా దళాలను గుర్తించారని పేర్కొన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు. దీని అర్థం చొరబాటేనని తెలిపారు.