క్షయ వ్యాధి నివారణకు వినియోగించే టీకా.. కరోనా నియంత్రణకు ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై పరిశోధన జరపనున్నట్టు ఐసీఎంఆర్(భారత వైద్య పరిశోధన మండలి) తెలిపింది. అయితే కచ్చితమైన ఫలితాలు వెలువడేంత వరకు ఈ వ్యాక్సిన్‌ను వైరస్ చికిత్సకు సిఫార్సు చేయబోమని స్పష్టం చేసింది.
బాసిలస్ కాల్మెటే- గురిన్(బీసీజీ) అనే వ్యాక్సిన్‌ను క్షయ వ్యాధి నివారణకు వినియోగిస్తారు. మనిషి పుట్టిన వెంటనే ఈ బీసీజీ వ్యాక్సిన్‌ను అందిస్తారు. అయితే దీని వల్ల క్షయ సోకదు అని కచ్చితంగా చెప్పలేకపోయినా.. కొంతమేర వరకు రక్షణ కల్పిస్తుంది.
వైరస్ చికిత్సకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందా? లేదా? అనే అంశంపై వచ్చే వారం నుంచి పరిశోధన జరపనున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్‌తో లాభాలు తక్కువనే అంటున్నారు ఐసీఎంఆర్‌లోని ఎపిడెమియోలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగ అధిపతి డా. గంగాఖేద్కర్.