కరోనా వైరస్ సోకకుండా వైద్య సిబ్బంది ముందుజాగ్రత్తగా తీసుకుంటున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) మాత్రలను కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరికి ఈ మందు ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వకూడదన్నది అందులో సవివరంగా పేర్కొంది.
ఇంతకు ముందు.. కరోనా నియంత్రణ కోసం ముందు జాగ్రత్తగా ఆరోగ్య కార్యకర్తలు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధమున్న వారు ఈ ఔషధాన్ని వాడొచ్చని తెలిపింది. అయితే తాజాగా ఆ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీస్ (డీజీహెచ్ఎస్) అధ్వర్యంలో జాయింట్ మానిటరింగ్ గ్రూప్, ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సమీక్షించిన అనంతరం తాజా సిఫార్సులు చేశారు.
పనిచేయడం లేదు..
పుణెలోని ఎన్ఐవీ నివేదిక ప్రకారం, ఇన్-విట్రో టెస్టింగ్‌లో కొవిడ్-19ను నియంత్రించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. సార్స్-కోవ్-2 ఆర్ఎన్ఏను కూడా నియంత్రించలేకపోయింది.
అందువల్ల 15 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణిలు, పాలిచ్చే తల్లులు ఈ హెచ్‌సీక్యూ వాడకూడదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.