కరోనా మరణాలకు గల మూలకారణాల్ని కచ్చితంగా, తగిన విధంగా నమోదు చేయడానికి 'భారత వైద్య పరిశోధన మండలి' (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రోగులు నిమోనియా, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం సహా మరికొన్ని ఇతర రోగాలకు దారితీసి చనిపోతేనే కొవిడ్-19 మరణంగా నమోదు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
అత్యవసరం
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19తో మరణించడానికి గల అసలు కారణాన్ని నమోదు చేయడం అత్యవసరమని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. జిల్లాలు, రాష్ట్రాల వారీగా ఈ కేసులు నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇతర వ్యాధులు ఉన్నవారినీ పర్యవేక్షించాలని సూచించింది. అప్పుడే ప్రజల అవసరాలకు తగినట్టు ఆరోగ్య వ్యవస్థ సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది.
కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో త్వరితగతిన, సకాలంలో, తగిన ప్రణాళికతో స్పందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అలాగే ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధతకు కూడా ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు... కరోనా లక్షణాలు ఉండి, ఇంకా నిర్ధరణ పరీక్షల ఫలితాలు రాని వాటిని.. అనుమానాస్పద మరణాలుగానే పరిగణిస్తారు. అలా కాకుండా పరీక్షలో నెగిటివ్ అని వచ్చి కూడా వైద్యపరంగా ఎపిడెమియోలాజికల్గా నిర్ధరణ అయితే కొవిడ్-19తో మరణించినట్లుగా పరిగణిస్తారు. వ్యాధి తీవ్రత, అనుబంధ వ్యాధులు, రోగుల వయస్సు ఆధారంగా కూడా ఈ క్లినికల్ ప్రెజెంటేషన్ అధారపడి ఉంటుంది.
మరణానికి దారితీసే పరిస్థితులు
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం, వైద్యులు.. రోగి మరణించడానికి గల కారణాలను ఓ క్రమపద్ధతిలో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రోగి మరణానికి గల మూల కారణం, తక్షణ కారణాలను వివరించాల్సి ఉంటుంది.
ఆస్తమా, క్రానిక్ బ్రోన్కైటిస్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్, డయాబెటిస్ మెల్లిటస్ లాంటి ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అయితే ఇవి నేరుగా మరణానికి కారణం కానందున వీటిని కరోనా మృతికి మూలకారణంగా పరిగణించరు.
ఇదీ చూడండి:మండలి అభ్యర్థిగా ఠాక్రే నామినేషన్- ఎన్నిక లాంఛనమే!