తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: మరెందరో ఐఏఎస్​లది జేడీ కథే!

ఈ మధ్య కాలంలో రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు. ఉన్నతోద్యోగాలను కాదనుకొని రాజకీయ కదనరంగంలోకి వస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారూ ఈ జాబితాలో ఉన్నారు.  ప్రజాసేవ కోసం కొందరు... ఇప్పటికే ఉన్న పేరు, ప్రతిష్ఠలను పెంచుకునేందుకు మరికొందరు ఉత్సాహం చూపుతున్నారు. రాజకీయ పార్టీలు వారికి తగిన ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో చాలా మందికి టికెట్లు ఇచ్చాయి ప్రధాన రాజకీయ పార్టీలు.

By

Published : Apr 20, 2019, 10:19 AM IST

దేశవ్యాప్తంగా రాజకీయాల వైపు ఐఏఎస్​, ఐపీఎస్​లు

దేశవ్యాప్తంగా రాజకీయాల వైపు ఐఏఎస్​, ఐపీఎస్​లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీబీఐ జేడీగా ఎప్పుడూ గుర్తుండిపోయే ఐపీఎస్​​ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ. ఏపీలో సీబీఐ జాయింట్​ డైరెక్టర్​గా ఉన్న సమయంలో ఆయన సంచలన కేసులను విచారించారు. నిజాయితీపరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొంది... రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన తరఫున విశాఖ లోక్​సభ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రజాతీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.

లక్ష్మీనారాయణ లాంటి కొందరు మాజీ ఐఏఎస్​లు, ఐపీఎస్​లు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచారు. మరికొందరు పార్టీలూ స్థాపించారు.

హరియాణా నుంచి యువ ఐఏఎస్​

స్వాతి యాదవ్​.. హరియాణాకు చెందిన యువ ఐఏఎస్​. రాజకీయాల కోసం ఉన్నతోద్యోగాన్ని​ వదిలేశారు. ఆమ్​ఆద్మీ పార్టీ మిత్రపక్షం జన్​ నాయక్​ జనతా పార్టీ(జేజేపీ)లో చేరారు. హరియాణాలోని భివానీ-మహేంద్రగఢ్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

"రాజకీయాల్లో ప్రారంభం బాగా ఉంటుందనే అనుకుంటున్నా. ఒక మంచి లక్ష్యం, ఉద్దేశంతో ముందుకు సాగుతున్నా. యువ, ఉన్నత విద్యావంతురాలైన అభ్యర్థిని నేను. యువత నా అర్హతల గురించి తెలుసుకొని ఓట్లు వేస్తారని అనుకుంటున్నా. అలాగే వృద్ధుల ఆప్యాయతను పొందుతాననే నమ్మకం ఉంది. సానుకూలంగా ముందుకెళతా."

-- స్వాతి యాదవ్​, మాజీ ఐఏఎస్​ అధికారి

అసోం నుంచి ఆంధ్రా మాజీ ఐఏఎస్​

1985 బ్యాచ్​ ఆంధ్రప్రదేశ్​కు చెందిన విశ్రాంత ఐఏఎస్​ అధికారి ఎంజీవీకే భాను అసోంలో రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తేజ్​పుర్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈనెల 11న పోలింగ్​ పూర్తయింది. ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు.

అసోం అదనపు ముఖ్య కార్యదర్శిగా గతేడాది పదవీ విరమణ చేశారు భాను. కేంద్ర పర్యటక శాఖ సంచాలకుడిగా, టీ బోర్డు ఛైర్మన్​గానూ ఆయన గతంలో పని చేశారు.

బంగాల్​ నుంచి మాజీ ఐపీఎస్​

బంగాల్​లోని ఘటల్​ లోక్​సభ స్థానం నుంచి భాజపా తరఫున బరిలోకి దిగారు మాజీ ఐపీఎస్​ అధికారి భారతీ ఘోష్​. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితంగా పనిచేశారు. ఇప్పడు తృణమూల్​ అభ్యర్థి దీపక్​ అధికారిపై పోటీకి దిగారు.

సస్పెండైన ఐపీఎస్..

వివాహేతర సంబంధాల ఆరోపణలతో విధుల నుంచి సస్పెండైన ఐపీఎస్​ అధికారి పంకజ్​ చౌదరి... రాజస్థాన్​లోని బాడ్​మేడ్​​ లోక్​సభ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన భార్య ముకుల్​ చౌదరి జోధ్​పుర్​ నుంచి పోటీ చేస్తున్నారు.

కటక్​ నుంచి మాజీ డీజీపీ

ఒడిశా మాజీ డీజీపీ ప్రకాశ్​ మిశ్రా ఇటీవలే భాజపాలో చేరారు. ఆయన ఆ రాష్ట్రంలోని కటక్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2002 నుంచి రెండేళ్ల పాటు ఒడిశా డీజీపీగా పని చేశారు ప్రకాశ్​. ఆ తర్వాత 2016 వరకు సీఎఆర్పీఎఫ్​ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు.

పార్టీ పెట్టారు.. పోటీకి దిగలేదు

జమ్ముకశ్మీర్​ పీపుల్స్​ మూవ్​మెంట్​(జేకేపీఎం) పార్టీని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు మాజీ ఐఏఎస్​ అధికారి షా ఫైసల్​. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ దిగడం లేదని ప్రకటించారు. ప్రజలు సరైన అభ్యర్థులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

కశ్మీర్​ నుంచి మొట్టమొదటిసారి 2009లో సివిల్స్​లో టాప్​ ర్యాంకు సాధించారు ఫైజల్​.

ఇప్పటికే కేంద్ర మంత్రిగా..

ఐపీఎస్​ అధికారిగా 2014లో పదవీ విరమణ పొందిన సత్యపాల్​ సింగ్​ ఇప్పటికే మోదీ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోనిలోని భగ్​పట్​ నుంచి మరోమారు పోటీ చేశారు. ఈనెల​ 11న అక్కడ పోలింగ్​ జరిగింది. ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు సత్యపాల్​ సింగ్​.

ABOUT THE AUTHOR

...view details