భారత వాయుసేన తన సంకల్పం, శక్తి సామర్థ్యాలు, కార్యాచరణను ప్రదర్శించిందని తెలిపారు ఐఏఎఫ్ ఛీప్ ఆర్కేఎస్ భదౌరియా. అవసరమైనప్పుడు శత్రువుకు తగిన రీతిలో బుద్ధి చెప్పే సత్తా ఉందని తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్నారు వాయుసేన అధిపతి. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన చురుగ్గా స్పందించిన తీరుకు అభినందనలు తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యానికి అతి తక్కువ సమయంలోనే సాయం అదించి యుద్ధ సన్నద్ధతకు సహకరించడంపై ప్రశంసలు కురిపించారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు వైమానిక దళం సిద్ధమని స్పష్టం చేశారు.
అట్టహాసంగా..
భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘజియాబాద్ 'హిండన్ ఎయిర్‌స్టేషన్'లో వేడుకలు జరిగాయి. ఎయిర్‌ఫోర్స్‌డేను పురస్కరించుకుని వైమానిక దళం పరేడ్ నిర్వహించింది. దీనిలో వాయుసేనకు చెందిన 56 విమానాలు పాల్గొన్నాయి. తేజస్, జాగ్వర్, సుఖోయ్ సహా 19 యుద్ధ విమానాలు, 19 హెలికాప్టర్లు వీటిలో ఉన్నాయి. ఇటీవలే వైమానిక దళంలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.
వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు.