భారత వైమానికదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్ యుద్ధ విమానం భారత్ చేతికి అందింది. ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్లో డసో ఏవియేషన్ కర్మాగారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ రఫేల్‌ను అధికారికంగా స్వీకరించారు. రఫేల్ అందిన ఈ రోజు చరిత్రాత్మకమైనదిగా రాజ్‌నాథ్ అభివర్ణించారు.
"భారత భద్రతాదళాలకు ఇది చరిత్రాత్మకమైన రోజు. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుంది. భారత్‌లో ఈ రోజు దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను నిర్వహించుకుంటాం. ఈరోజు వాయుసేన 87వ దినోత్సవం కూడా. అందువల్ల ఈ రోజు అనేక రూపాల్లో ప్రత్యేకమైనది. రఫేల్ యుద్ధ విమానం భారత్‌కు నిర్దేశిత సమయంలోనే అందినందుకు నాకు సంతోషం కల్గుతోంది. ఈ విమానం భారత వాయుసేన శక్తిని పెంచుతుంది. వాయుసేనను సమర్ధంగా తీర్చిదిద్దడం, దాని సత్తాను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు, దానికి సంబంధించిన పరికరాలు, ఆయుధ వ్యవస్ధ పరికరాలు నిర్దేశిత సమయంలోనే భారత్‌కు అందగలవని మాకు నమ్మకం ఉంది."
- రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి
ఆయుధపూజ
ఫ్రాన్స్ ఉన్నతస్థాయి రక్షణ ప్రతినిధులు, డసో అధికారుల సమక్షంలో రాజ్‌నాథ్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు. దసరా పండుగతో పాటు వాయుసేన 87వ వార్షికోత్సవం రోజే రఫేల్ భారత్‌కు అందడం పట్ల రాజ్‌నాథ్ సంతోషం వ్యక్తం చేశారు. విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం రఫేల్‌లో రాజ్‌నాథ్ విహరించారు.