భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రాంతాల్లో అణువణువూనూ శోధించేందుకు ఇస్రో శాటిలైట్లు సహాయం అందిస్తున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్ పశ్చిమ సియాంగ్ జిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఈ విమానంలో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం చైనా సరిహద్దుల్లో ఉన్న మెంచుకా అడ్వాన్స్డ్ లాండింగ్ గ్రౌండ్‌కు చేరుకావాల్సి ఉంది.
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యల కోసం నావికా దళానికి చెందిన 'పీ 8 ఐ ఎస్పీవై' విమానాలు వినియోగిస్తున్నారు.
భారత వైమానిక దళానికి చెందిన రెండు సుఖోయ్ 30, సీ 130జే సూపర్ పెర్యూలస్ యుద్ధ విమానాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. భారత సైన్యం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, రాష్ట్రపోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ చర్యలన్నింటినీ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు.