ధనోవా సమక్షంలో అభినందన్ యుద్ధ విన్యాసాలు! భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్... మరోసారి మిగ్-21 విమానంలో యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్ సేనకు చిక్కి, విడుదలైన అనేక నెలల తర్వాత తొలిసారిగా విమానాన్ని నడిపారు. పంజాబ్ పఠాన్‌కోట్ వైమానిక స్థావరం నుంచి వాయుసేన అధినేత బీఎస్ ధనోవాతో కలిసి ఆకాశ వీధుల్లోకి దూసుకెళ్లారు వర్ధమాన్.
అధీనం నుంచి వీర్‌చక్ర దాకా...
పుల్వామా దాడి అనంతరం భారత వాయుసేన(ఐఏఎఫ్).. పాక్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఫిబ్రవరి 27న మనదేశ గగనతలంలోకి చొరబాటుకు యత్నించిన పాక్ విమానాలను తిప్పికొట్టింది ఐఏఎఫ్. ఈ పోరాటంలో తాను నడుపుతున్న మిగ్-21 విమానం ప్రత్యర్థి భూభాగంలో కూలిపోయిన కారణంగా దాయాది సేనలకు చిక్కారు అభినందన్. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో మార్చి 2న అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది పాక్.
పాక్ సైన్యం అధీనం నుంచి భారత్ చేరుకున్న అభినందన్‌కు రక్షణ, నిఘా సంస్థల అధికారుల సమక్షంలో శారీరక, మాససిక పరీక్షలు నిర్వహించారు. ఐఏఎఫ్ చీఫ్ సమక్షంలో నేడు మిగ్-21 విమానంతో మరోసారి గగనతలంలో దూసుకెళ్లారు అభినందన్.
బాలాకోట్ వైమానికి దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడినందుకు.. యుద్ధ సమయాల్లో సైనికులను సత్కరించే మూడో అత్యున్నత అవార్డు.. వీర్‌చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది కేంద్రం