భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా బలగాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లినా.. డ్రాగన్ కుయుక్తులను దృష్టిలో ఉంచుకొని భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ మేరకు లద్దాఖ్ ప్రాంతంలో భారత్ వాయుసేన 24 గంటలపాటు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా యుద్ధ సన్నద్ధతపై అంచనా వేస్తోంది.
ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్‌లు, యుద్ధ హెలికాఫ్టర్లు, మల్టీ మిషన్ చాపర్లు వంటి వాటిని అక్కడి ఎయిర్‌బేస్ నుంచి రాత్రి సమయాల్లో కూడా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా రాత్రివేళల్లోనూ గస్తీ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
భారీ సన్నద్ధత
వాయుసేనకు చెందిన మిగ్-29 ఫైటర్ జెట్లు, సుఖోయ్-30ఎస్ విమానాలు, అపాచీ ఏహెచ్-64ఈ యుద్ధ హెలికాఫ్టర్లు, సీహెచ్-47ఎఫ్ (ఐ) చినూక్ మల్టీ మిషన్ హెలికాఫ్టర్లు వంటి వాటిని లద్దాఖ్ పర్వతశ్రేణుల్లో వాయుసేన మోహరించింది. దీని ద్వారా భారత్‌కు తగిన సామర్థ్యం ఉందని, అవసరమైనప్పుడు బదులిచ్చే సత్తా తమకుందనే సందేశాన్ని డ్రాగన్ దేశానికి పంపడం దీని ముఖ్య ఉద్దేశం అని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"గతంలో పర్వత ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీకి కొన్ని పరిమితులు ఉండేవి. ప్రస్తుతం వాటన్నింటినీ అధిగమించాం. లద్దాఖ్‌లో రాత్రిపూట వాయుసేన కార్యకలాపాలు చేపట్టడం ఐఏఎఫ్ శిక్షణలో భాగం. దీని ద్వారా పైలట్లు, ఇతర సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు"