కన్నడనాట భాజపా పాగా వేసేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యడ్యూరప్పకు సీఎంగా ప్రమాణం ఇది నాలుగోసారి.
భాజపా నేతలతో కలిసి యడ్యూరప్ప ఈ రోజు ఉదయం రాజ్‌భవన్ వెళ్లారు. తమకు సంఖ్యాబలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్.. ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. అయితే.. జులై 31లోగా విధానసభలో బలం నిరూపించుకోవాలని గడువు విధించారు.
గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు యడ్యూరప్ప. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాణ కార్యక్రమానికి కుమారస్వామి, సిద్ధరామయ్యలను స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపారు.
''ఇప్పుడే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశా. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని కోరా. ఆయన అంగీకరించారు. ఈ రోజు 6 నుంచి 6.15 గంటల మధ్య ప్రమాణం స్వీకారం చేస్తా.''
- బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు