ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పౌరచట్టం, ఎన్ఆర్సీలను వెనక్కి తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు దీదీ.
కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. బంగాల్ రాజ్‌భవన్ వేదికగా మమతతో సమావేశమయ్యారు. పలు అంశాలపై ప్రధాని, ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. సమావేశం అనంతరం వివిధ కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని కోరేందుకే ప్రధానితో భేటీ అయినట్లు వివరించారు దీదీ.
"ప్రధానితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. రాష్ట్రానికి రావలసిన రూ.28 కోట్ల అంశాన్ని మోదీకి నివేదించాను. పౌరచట్ట సవరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని తెలిపాను. మేం పై మూడు అంశాలకు వ్యతిరేకమని వివరించాను. కేంద్రం పునరాలోచించి పౌరచట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాను."