మహిళలు అన్నింటా దూసుకెళుతున్నారనడానికి ఆమె ఓ ఉదాహరణ. పాఠశాల, కళాశాలలో టాపర్‌గా నిలవటమే కాదు.. ఆర్మీ మేజర్‌గానూ అందరి మన్ననలు పొందారు. భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఎగురవేసేందుకు సహాయాధికారిగా విధులు నిర్వర్తించి యావత్ భారతావని చూపును ఆకర్షించారు. ఆమెనే మేజర్ శ్వేతా పాండే.
ప్రధాని మోదీ ఎర్రకోటలో జెండా ఎగురవేస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మేజర్ శ్వేతా పాండే. జెండా ఆవిష్కరణ సమయంలో ప్రధానికి సహాయంగా ఉండేందుకు రక్షణ శాఖ కొద్ది రోజుల ముందే ఆమెను స్వాతంత్ర్య దినోత్సవ ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఎంపిక చేసింది.
సైన్యంలోని 505 బేస్ వర్క్‌షాప్ సైనిక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు శ్వేతా పాండే. ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర ఆయుధ సంపత్తికి అవసరమైన మరమ్మతులు చేసే పనులను పర్యవేక్షిస్తుంటారు. ఆ విభాగంలో ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్) ఆఫీసర్ ఆమె. ఈ ఏడాది జరిగిన రష్యా విక్టరీ డే, భారత స్వాతంత్ర్య దినోత్సవం దళాధిపతిగా శ్వేతకు అవకాశం లభించింది.