తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 3:05 PM IST

ETV Bharat / bharat

నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబవుతున్న వేళ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. యాంటీ-ఎయిర్​క్రాఫ్ట్ వ్యవస్థలు, సీసీ కెమెరాలు సిద్ధం చేశారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

I-Day terror alert: Centre beefs up security in view of airstrike threat at Red Fort
స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దిల్లీలో పటిష్ఠ భద్రత

శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గగనతలంలో ఐదు కిలోమీటర్ల పరిధిలోని అనుమానాస్పద పరికరాలను గుర్తించే యాంటీ ఎయిర్​క్రాఫ్ట్ వ్యవస్థలను దిల్లీ పోలీసులు సిద్ధం చేశారు.

అయోధ్యలో రామ మందిర భూమిపూజ జరిగిన తర్వాత ఉగ్ర దాడులపై దేశ నలుమూలల నుంచి హెచ్చరికలు వచ్చినట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. గగనతలం నుంచి కూడా దాడి జరిగే అవకాశం ఉందని దిల్లీ పోలీసులకు సమాచారం అందింది.

స్నైపర్లతో భద్రత

ఈ నేపథ్యంలో భద్రత పటిష్ఠం చేస్తున్నారు అధికారులు. ఎర్రకోట మీదుగా ఉన్న గగనతలాన్ని నో-ఫ్లై జోన్​గా ప్రకటించారు. ఉత్సవాలు జరిగే ఎర్రకోటకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భవనాల్లో స్నైపర్లను మోహరించారు. అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించినా అలర్ట్ చేసేలా యాంటీ ఎయిర్​క్రాఫ్ట్ వ్యవస్థను సిద్ధం చేశారు.

ఎర్రకోట పరిసరాల్లో 5 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు, ఎన్​ఎస్​జీ, ఎస్​పీజీ బృందాలు భద్రతలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

వైరస్​ దృష్టిలో ఉంచుకొని

స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణపై జులై 24న హోంశాఖ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి అంశాలను పాటించాలని స్పష్టం చేసింది. పరిశుభ్రత పాటించాలని, పెద్ద ఎత్తున గుమిగూడటం చేయొద్దని సూచించింది.

ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద నిర్వహించే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమంపై అనుమానాలు నెలకొన్నాయి. దాదాపు 2 వేల మంది చిన్నారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడమో, విద్యార్థుల సంఖ్యను కుదించడమో జరుగుతుందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఎర్రకోటకు ఇరువైపులా ఉన్న రెండు మైదానాలను సైతం మూసేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి-నూతన పార్లమెంటు ప్రాజెక్ట్​ రేసులో 3 పెద్ద సంస్థలు

ABOUT THE AUTHOR

...view details