'నేను ఇందిరా గాంధీ మనవరాలిని.. కొందరు ప్రతిపక్ష నేతల్లా అప్రకటిత భాజపా ప్రతినిధిని కాదు' అంటూ.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ. నిజాలు మాట్లాడినందుకు తనపై వివిధ విభాగాల ద్వారా యూపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు.
కాన్పుర్ వసతిగృహం వివాదంపై ప్రియాంకకు యూపీ బాలల హక్కుల సంఘం నోటీసులు జారీ చేసి... మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ మరుసటి రోజునే ఈ మేరకు స్పందించారు ప్రియాంక.
" ప్రజాసేవకురాలిగా నా కర్తవ్యం ఉత్తర్ప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి సాయపడటమే. షెల్టర్ హోంపై మాట్లాడటం ప్రజల ముందు సత్యాన్ని ఉంచేందుకే కానీ ప్రభుత్వ అనుకూల ప్రచారానికి కాదు. వివిధ విభాగాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ యూపీ ప్రభుత్వం సమయాన్ని వృథా చేసుకుంటోంది. వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోని.. నేను నిజాలను బయటపెడుతూనే ఉంటాను. నేను ఇందిరా గాంధీ మనవరాలిని.. కొందరు ప్రతిపక్ష నాయకుల్లా అప్రకటిత భాజపా ప్రతినిధిని కాను."