బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార జేడీయూ-భాజపా కూటమి నుంచి వైదొలిగిన లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్.. మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ బొమ్మను వాడనని చెప్పిన ఆయన.. తాను నరేంద్ర మోదీకి వీరభక్తుడిగా అభివర్ణించుకున్నారు.
" ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ప్రచారాలకు వాడుకోవాల్సిన అవసరం లేదు. మోదీ నా గుండెల్లో ఉన్నారు. నేను ఆయనకు హనుమంతుడిని. అవసరమైతే నా గుండెలు చీల్చి చూపిస్తాను"
-- చిరాగ్ పాసవాన్, లోక్ జన్శక్తి పార్టీ అధ్యక్షుడు
ఎన్డీఏలో నితీశ్ నాయకత్వాన్ని అంగీకరించలేమంటూ ఇటీవలే కూటమి నుంచి వైదొలిగింది ఎల్జేపీ. ఎన్నికల అనంతరం ఎల్జేపీ ఎమ్మెల్యేలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు పాసవాన్.
ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ అభ్యర్థుల ప్రకటన..
అసెంబ్లీ ఎన్నికల రెండో విడత కోసం 26 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఎల్జేపీ. మొత్తం 243 స్థానాలకు.. 143 స్థానాల్లో పోటీచేస్తోంది ఆ పార్టీ. కేవలం జేడీయూ పోటీ చేస్తున్న స్థానాల్లోనే అభ్యర్థులను బరిలోకి దించుతోంది.
2015లో ఎల్జేపీ 42 స్థానాల్లో పోటీ చేయగా రెండు చోట్ల విజయం సాధించింది.