పుడమిని నేను. నా మానవ సంతానం 775 కోట్లు!. క్రీస్తు శకం 1వ సంవత్సరంలో 20 కోట్ల మందే ఉండేవారు. 2020 నాటికి 38 రెట్లు పెరిగి.. 775 కోట్ల మంది అయ్యారు. 2030కి 854 కోట్లు, 2057కి 1000 కోట్లు అవుతారు. నేను జాగ్రత్తగా కూడబెట్టిన సహజ వనరులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కవచ కుండలాలు తెగిన కర్ణుడిలా బలహీనపడిపోతున్నాను. నా ఒళ్లు వేడెక్కుతోంది. కొత్త దశాబ్దిలోనూ ఇలాగే కొనసాగితే అందరికీ ఆహారాన్ని అందించే శక్తిని కోల్పోతాను. కాబట్టి బిడ్డలూ.. కొత్త సంవత్సరంలో ఇంధనాలను పొదుపుగా వాడండి. సౌర, వాయు శక్తుల్ని హాయిగా వినియోగించుకోండి. పచ్చని చెట్లను పెంచి పచ్చగా జీవించండి.
మీ శ్రేయోభిలాషి ఐరాసని..
రణ నీతికి స్వస్తి పలికి.. శాంతి గీతిని వినిపించే బాధ్యతల్ని ప్రపంచం నాకు అప్పగించింది. దేశాల మధ్య సుహృద్భావం, ప్రజలందరి సుఖ జీవనమే నా లక్ష్యం. కొత్త దశాబ్దంలోనూ ఆ కృషిని కొనసాగిస్తా. ప్రపంచంలో పోషకాహార లోపం ఎదుర్కొంటున్నవారు 82.1 కోట్ల మంది, నిరక్షరాస్యులు 75 కోట్ల మంది, పేదలు 73.6 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఐదుగురి (6-17 ఏళ్ల మధ్య వయసు)లో ఒకరు బడికి వెళ్లడంలేదు. ఒక కుటుంబంలో నలుగురు బాగా ఎదిగి, నలుగురు పేదరికంలో ఉంటే తండ్రికి ఎలా ఉంటుందో? నాకూ అలానే ఉంది. అందుకే 2030 నాటికి ఈ సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పెట్టుకొని కృషి చేస్తున్నా. మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా.