కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు విస్తృతంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు వైద్యులు వ్యాప్తితో పాటు వ్యాధిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధ వినియోగం, దానివల్ల కలిగే దుష్ఫలితాలు, ఉపయోగాలపై దృష్టి సారించారు నిపుణులు.
ఫలితంగా కరోనా చికిత్స కోసం ప్రపంచ దేశాలు హైడ్రాక్సీ క్లోరో క్విన్ (హెచ్‌సీక్యూ) సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ మందు పని తనంపై సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు.
నమ్మకం వద్దు..
కరోనాకు హెచ్‌సీక్యూ దివ్య ఔషధం కాదని పెదవి విరుస్తున్నారు. కరోనా విషయంలో ఊహించినంత ప్రయోజనం చేకూర్చలేదని.. దీనిపై నమ్మకం పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దీని ద్వారా మరణమూ సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
"కరోనాకు నిర్ధిష్టమైన చికిత్స విధానం ఇంకా లేదు. వైరల్ చికిత్సలో భాగంగానే కరోనాకు హెచ్‌సీక్యూను ప్రాథమిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీని సామర్థ్యంపై శాస్త్రీయ రుజువులేమీ లేవు. అయితే దీని వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి."