తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు ఆలస్యం..'నీట్'​కు దూరమైన వందలాది మంది

కర్ణాటకలో వందలాది మంది విద్యార్థులు నేడు జరిగిన నీట్​ పరీక్ష రాయలేకపోయారు. హంపీ ఎక్స్​ప్రెస్​ బెంగళూరుకు గంట ఆలస్యంగా చేరుకోవడమే ఇందుకు కారణం. కష్టం వృథా అయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : May 5, 2019, 11:03 PM IST

Updated : May 6, 2019, 12:32 AM IST

రైలు ఆలస్యం..'నీట్'​కు దూరమైన వందలాది మంది

రైలు ఆలస్యం..'నీట్'​కు దూరమైన వందలాది మంది

కర్ణాటకలో రైలు ఆలస్యం కావడం వల్ల ఆదివారం జరిగిన నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) ​​ పరీక్షను వందలాది మంది అభ్యర్థులు రాయలేకపోయారు. గంట ఆలస్యంగా రైలు బెంగళూరుకు చేరిందని, ఈ కారణంగా తాము పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎం​బీబీఎస్​, బీడీఎస్​ కోర్సుల ప్రవేశపరీక్ష 'నీట్​'కి ఈసారి దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు​ చేసుకున్నారని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) తెలిపింది. కర్ణాటకలో మినహాయిస్తే దేశవ్యాప్తంగా నీట్​ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫొని తుపాన్ కారణంగా ఒడిశాలో నీట్​ పరీక్షను మానవ వనరుల మంత్రిత్వశాఖ వాయిదా వేసింది.

'16591-హంపీ ఎక్స్​ప్రెస్'​ గంట ఆలస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. ఫలితంగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు.

ఇది మోదీ వైఫల్యమే...

రైలు ఆలస్యమై కర్ణాటక విద్యార్థులు నీట్​ పరీక్ష రాయలేకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది భాజపా, ప్రధాని మోదీ వైఫల్యమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

"నరేంద్రమోదీ.. మీరు ఇతరుల ఘనతను మీదిగా చెప్పుకుంటారు. దీనితో పాటు మీ కేబినెట్​ మంత్రుల చేతకానితనానికీ మీరే బాధ్యత వహించాలి. రైలు ఆలస్యం కావడం వల్ల వందలాది మంది కర్ణాటక విద్యార్థులు నీట్​ పరీక్ష రాయలేకపోయారు." -సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

ఎన్నికల వల్ల వాయిదా

లోక్​సభ ఎన్నికల కారణంగా కొన్ని నీట్​ పరీక్ష కేంద్రాలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ మార్పులు చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం ముందుగానే అభ్యర్థులకు తెలియజేసింది. సరికొత్త హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది.

ఈసారి నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణ విషయంలో పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సల్వార్లు, ప్యాంట్లు ధరించాలని, కురస చొక్కాలు మాత్రమే వేసుకోవాలని సూచించింది. పెద్ద బటన్లు, బ్యాడ్జ్​లు, పూలు ధరించిన విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు.

ఇదీ చూడండి: 'రాహుల్​ గాంధీ ఆరోపణలు నిరాధారం'

Last Updated : May 6, 2019, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details