తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ ఉల్లం'ఘను'ల కట్టడికి పటిష్ఠ చర్యలు - కరోనా వైరస్ వార్తలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా లాక్​డౌన్​ నిబంధనలను పూర్తిస్థాయిలో ప్రజలు పాటించటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేస్తున్నాయి. జరిమానాలు విధిస్తున్నాయి.

LOCKDOWN
లాక్​డౌన్​ ఉల్లం'ఘను'ల కట్టడికి పటిష్ఠ చర్యలు

By

Published : Mar 27, 2020, 8:18 AM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించి ఇప్పటికీ రెండు రోజులు గడిచాయి. మొదటి రోజు ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని గురువారం పటిష్ఠమైన నిఘా పెట్టారు అధికారులు. హెచ్చరికలు చేయటానికి డ్రోన్లను ఉపయోగించారు. వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనాల్లో తిరుగుతూ నిబంధనలను మైకుల్లో ప్రచారం చేశారు.

ఎమ్మెల్యేపై కేసు..

లాక్​డౌన్​ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలను ఉల్లంఘించారని పుదుచ్చేరిలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. కూరగాయలు వితరణ చేస్తున్న కారణంగా ఎమ్మెల్యే ఇంటిముందు 200 మంది గుమికూడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ.

బయటికి వెళ్లాడని..

ముంబయి కాందివళి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. లాక్​డౌన్​ అమల్లో ఉన్నా బయటికి వెళ్లాడన్న కోపంతో సోదరుడిని హతమార్చాడు రాజేశ్ అనే యువకుడు. ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవటంతోనే ఈ పని చేశానని రాజేశ్ వెల్లడించాడు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

బిహార్​లో ఉల్లంఘనులను తీవ్రంగా శిక్షించారు పోలీసులు. సుమారు 40 మందిని అరెస్ట్ చేశారు. 1,300 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జరిమానాల రూపంలో రూ.24 లక్షల మేర వసూలు చేశారు.

తమిళనాడులో 1,200 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. శివగంగలో ఉల్లంఘనులకు బ్యానర్లు ఇచ్చి ప్రచారం చేయించారు. వెల్లూరులో బయటికి రాబోమని ప్రతిజ్ఞ చేయించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 2,802 కేసులు నమోదు కాగా 8,649 మందిపై కేసు నమోదయ్యాయి.

పటిష్ఠ విధానం..

అత్యవసర సేవలు అందించే సిబ్బందిని అడ్డుకున్న ఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరా వ్యవస్థ, అత్యవసర సేవల విషయంలో కేంద్ర హోంశాఖ స్థిర విధానాన్ని గురువారం రాత్రి రూపొందించింది.

అత్యవసర వస్తువుల సరఫరాదారులు, రెస్టారెంట్లు ఇంటివద్దకే డెలివరీ సదుపాయాలను లాక్​డౌన్​ నుంచి మినహాయించారు. అత్యవసరాలను నిల్వ చేసే వేర్​హౌస్​, గోడౌన్లతో పాటు డ్రైవర్లకు మినహాయింపును ఇచ్చింది కేంద్రం.

పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి జిల్లాలో హంగర్​ రిలీఫ్ సెంటర్లు ప్రారంభించాలని కలెక్టర్లకు కేంద్రం ఆదేశాలిచ్చింది.

దిల్లీలో ఇలా..

దేశ రాజధానిలో అత్యవసరాల సరఫరాకు సంబంధించి వాహనాలకు అనుమతించాలని తమ అధికారులకు దిల్లీ పోలీసు విభాగం ఆదేశాలిచ్చింది. కూరగాయల బండ్లను ధ్వంసం చేసిన ఓ కానిస్టేబుల్​ను విధుల నుంచి తొలగించింది.

చండీగఢ్​లో ప్రభుత్వ బస్సులను అత్యవసరాల వస్తువుల డెలివరీకి ఉపయోగిస్తున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో కాలక్షేపం కోసం ఉచితంగా మంచి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది నేషనల్ బుక్​ ట్రస్ట్​.

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తూ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 694 మందికి కరోనా సోకగా 16 మంది మరణించారు.

ఇదీ చూడండి:కరోనా కేసులు పెరిగినా.. వ్యాప్తి రేటులో తగ్గుదల

ABOUT THE AUTHOR

...view details