భారత దేశంలో పోషకాహారానికి నోచుకోలేక ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మృతి చెందుతున్నారని ప్రఖ్యాత పరిశోధన సంస్థ లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి ఐదుగురిలో ఒక్కరు పోషకాహార లేమి కారణంగా చనిపోతున్నారని నివేదికలో వెల్లడించింది.
1990 నుంచి 2017 వరకు 195 దేశాల్లో 15 ఆహారపు అలవాట్లపై పరిశోధనలు జరిపి తుది నివేదిక రూపొందించింది లాన్సెట్. ఈ 27 ఏళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటీ పది లక్షల మందికిపైగా సరైన భోజనం లేక మరణించారని తెలిపింది. చాలా మంది దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని నివేదికలో పేర్కొంది.
పోషక విలువలు గల తృణధాన్యాలు, పండ్లు, గింజలు వంటి ఆహార పదార్థాలు భోజనంలో తక్కువ ఉండటం కారణంగా 2017లో ఎక్కువ మరణాలు సంభవించాయి.