కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా దాతల నుంచి విరాళాలు సేకరించి, కష్టాల్లో ఉన్నవారికి అందించే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఫండ్ (పీఎం కేర్స్)' పేరిట ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఎంత చిన్న విరాళమైనా ఇవ్వొచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు పలు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. భారీ విరాళాలతో పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.
కరోనాపై పోరుకు 'పీఎం కేర్స్' నిధికి భారీగా విరాళాలు - suresh raina latest news
కరోనాపై పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ రతన్ టాటా రూ.1500 కోట్ల విరాళం ప్రకటించారు. పారిశ్రామిక, రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. కరోనాపై పోరుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
కరోనాపై పోరుకు 'పీఎం కేర్స్' నిధికి భారీ విరాళాలు
విరాళాల వివరాలు..
- కరోనా నియంత్రణకు రూ.1500 కోట్లు ఖర్చుచేయనున్నట్లు టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ రతన్ టాటా ప్రకటించారు. టాటా సన్స్ తరఫున రూ. 1000 కోట్లు, టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
- బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ రూ. 25 కోట్లు సాయం ప్రకటించారు.
- డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం రూ.500కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపింది. తమ వినియోగ దారుల వాలెట్, యూపీఐ, పేటీఎం బ్యాంక్ ద్వారా చేసే ప్రతి లవాదేవీకి సంస్థ తరఫున అదనంగా రూ.10 వరకు జతజేసి విరాళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
- భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ.51 కోట్లు విరాళం ప్రకటించింది.
- భారత క్రికెటర్ సురేశ్ రైనా రూ. 52 లక్షల సాయం చేయనున్నట్లు తెలిపాడు. ఇందులో 31 లక్షలు పీఎం కేర్స్‌కు, 21 లక్షలు యూపీ సీఎం జాతీయ విపత్తుల సహాయనిధికి అందజేయనున్నట్లు ప్రకటించాడు.
- ఐఏఎస్ అధికారుల సంఘం రూ.21లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. కనీసం ఒకరోజు వేతనం కూడా ఇస్తామని తెలిపింది.
- జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర ఉద్యోగులంతా కలిసి ఏప్రిల్ నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
- ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా రూ.25 కోట్లు విలువ చేసే హైడ్రాక్సీ క్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ సహా ఇతర మందులు శానిటైజర్లను విరాళంగా అందజేయనున్నట్లు తెలిపింది.
- భాజపాకు చెందిన ఎంపీలంతా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. తమపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి ఇస్తారని తెలిపారు.
- లోకసభ సభ్యులందరూ తమ ఎంపీ నిధుల నుంచి పీఎం సహాయ నిధికి రూ. కోటి కేటాయించాలని కోరారు స్పీకర్ ఓంబిర్లా. రాజ్యసభ సభ్యులంతా తమ నిధుల నుంచి కనీసం రూ. కోటి చొప్పున సాయం అందించాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు వినతి చేశారు.
- కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి దేశంలోని ప్రతిపౌరుడ తమ వంతు సాయం అందించాలని ట్విట్టర్ వేదికగా వినతి చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తక్కువ మొత్తంలో రూ.501 మాత్రమే విరాళంగా అందిస్తున్నాని ఓ సామాన్యుడు చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు ప్రధాని మోదీ. ఎక్కువ, తక్కువ అనే తారతమ్యం లేదని తమవంతుగా చేతనైన సాయం చేయవచ్చని మోదీ తెలిపారు.